మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: చేనేత రంగ అభివృద్ధికి, నేత కార్మికులకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహకారం అందిస్తుందని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చేనేత వస్త్రం తయారీలో నేత కార్మికుల శ్రమ, నైపుణ్యం, అంకితభావం దాగి ఉంటాయన్నారు. చేతితో నేసిన ప్రతి వస్త్రాని కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందన్నారు. గద్వాల, నారాయణపేట చేనేత ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా నేత కార్మికులకు గరిష్ట ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహబూబ్‌నగర్ మినీ శిల్పారామంలో స్థానిక చేనేత ఉత్పత్తుల విక్రయ స్టాళ్ల ఏర్పాటుకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఆసక్తి కలిగిన చేనే త కార్మికులు జిల్లా హ్యాండ్లూమ్ అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకోవా లని సూచించారు. ప్రభు త్వ కార్యక్రమాల్లో చేనేత ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాల కోసం ఉచితంగా స్టాళ్లు ఏర్పాటు చేయిస్తామన్నారు. జిల్లాకు వచ్చే విశిష్ట అతిథులకు అందించే బహుమతులు, శాలువాలు స్థానిక చేనేత కార్మికుల నుంచే కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. చేనేతల సమస్య లు, సూచనలు తెలుసుకునేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అవసరమైతే గ్రామాల్లో పర్యటించి వారితో ప్రత్యక్షంగా మాట్లాడతామన్నారు. అనంతరం కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల స్టాళ్లను ఆమె పరిశీలించారు. అలాగే పదోతరగతి విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లు అందించారు. అంతకుముందు మెయిన్ గేట్ నుంచి లోపలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉత్తమ చేత కార్మికులను సన్మానించారు. శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, డీఆర్‌ఓ నిర్మల, జిల్లా హ్యాండ్లూమ్ అభివృద్ధి అధికారి రాజేష్ పాల్గొన్నారు.


