నవాబుపేట: మండలంలోని తీగలపల్లి సమీప రైస్‌మిల్లులో గురువారం విజిలెన్స్, ఎన్‌పోర్సుమెంట్ బృందం తనిఖీలు చేపట్టింది. రైస్‌మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన బృందం వడ్ల బస్తాల ధాన్యం నిల్వలపై ఆరాతీశారు. గతంలో మిల్లులో నిల్వ ఉంచిన బస్తాలపై ఆరాతీసి వివరాలు సేకరించారు. మూడేళ్ల క్రితం మిల్లులో వడ్ల బస్తాలు నిల్వ ఉంచారు. కాగా, వాటి నిర్వహణకు ప్రభుత్వం నెలకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. వాటి విషయంలో ఎటూ తేల్చకపోవడంతో వడ్ల బస్తాలు ఎండా, వానకు బయటనే ఉంచాల్సి వచ్చింది. కాగా, నిల్వ ఉన్న బస్తాల విషయంలో మిల్లర్లకు ప్రభుత్వానికి మధ్య మెంటేనెన్స్ విషయంలో ఒప్పందం కుదరలేదు. దీంతో నిల్వ ఉంచిన వడ్ల బస్తాల విషయం వెలుగుచూసింది. వాటి నిర్వహణ కొలిక్కి రాకపోవడంతో కోట్ల రూపాయలు వృథాగా పోయే పరిస్థితి వచ్చింది. దీంతోనే విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. కాగా, మండలంలోని తీగలపల్లి మిల్లులో చేపట్టిన తనిఖీల సందర్భంగా బస్తాల తూకం విషయం సైతం వెలుగు చూసిందని, రైతులు ఇష్టానుసారంగా బస్తాలు తీసుకొచ్చినట్లు తేలింది. పైగా కొనుగోలు కేంద్రాల వారు తూకాలు సరిగ్గా చేయకుండానే రైతుల ధాన్యం మిల్లులకు పంపిన విషయం వెలుగు చూసింది. తనిఖీ సందర్భంగా రైతులతో తీసుకున్న ధాన్యం నిల్వలు సరిగ్గానే ఉన్నాయని, మూడేళ్ల కిందట తీసుకున్న ధాన్యం బస్తాల నిర్వహణలో ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే సమస్యలు వచ్చినట్లు మిల్లు యజమాని అభిప్రాయం వ్యక్తం చేశాడు. తనిఖీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్‌ఓ శ్రీనివాసులు, రాజశేఖర్‌శర్మ, విజిలెన్స్ డీఎస్‌పీ శ్రీనివాస్, సీఐ గణేష్, రవి, దీపిక, మమత, సురేష్ పాల్గొన్నారు.


