ధరూరు/ఆత్మకూర్: ఎగువన కురిసిన భారీ వర్షాల తో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండడంతో ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టులు 2.20 లక్షల క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 28 గేట్లు ఎత్తి 1,88,606, విద్యుదుత్పత్తి ద్వారా 28,156 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ఇక కోయిల్ సాగర్‌కు 630 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 44 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 830 క్యూసెక్కులు, కుడి కాలువకు 600 క్యూసెక్కులు, సమాంతర కాలువకు 425 క్యూసెక్కులు,భీమా లిఫ్టు–1కు 1,300 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 872 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 2,21,558 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. మరోవైపు ఎగువ జూరాలకేంద్రంలో మాత్రమే విద్యుదుత్పత్తి చేపట్టారు. ఆరు యూనిట్ల ద్వారా 234 మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 54.962 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామన్నారు.


