● లబ్ధిదారులకు పరిహారం వెంటనేచెల్లించాలి: కలెక్టర్ ఖుష్బూగుప్తా
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో చేపడుతున్న భారత్‌మాల జాతీయ రహదారులు, రైల్వేలైన్ల డబ్లింగ్, టీజీఐఐసీ బ్రహ్మోస్ మిస్సైల్ పరిశ్రమ, ఎంజీకేఎల్‌ఐ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు తదితర ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటిదాకా సేకరించిన భూమికి సంబంధించిన పరిహారం చెల్లింపులను లబ్ధిదారుల ఖాతాల్లో వేగవంతం చేయాలన్నారు. వివాదాస్పద భూములకు సంబంధించిన అంశాలను వెంటనే పరిష్కరించి చెల్లింపులు పూర్తిచేయాలని చెప్పారు. రైల్వేలైన్ డబ్లింగ్‌కు సంబంధించిన భూసేకరణలో అవార్డులు, విచారణలు, పెండింగ్ భూసేకరణకు సంబంధించిన ప్రక్రియలను నిర్ధిష్ట గడువులో పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రజల అభ్యంతరాలున్న ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసి సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.ముందుగా ప్రభుత్వ భూమిని సర్వే చేసి, ఎలాంటి ఆక్రమణలు లేని సుమారు 63 ఎకరాలను అడ్వాన్స్ పొజీషన్ ద్వారా వెంటనే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెండింగ్ ఫైళ్ల పరిష్కారంలో జాప్యం వద్దు
కలెక్టరేట్‌లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు, ప్రజావాణి దరఖాస్తులు, ఆర్‌టీఐ దరఖాస్తులు, కోర్టు కేసుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండరాదని కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశించారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర కార్యాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఉద్యోగి తనకు అప్పగించిన బాధ్యతలను నిబంధనలకు అనుగుణంగా పూర్తి బాధ్యతతో నిర్వర్తించాలని సూచించారు. ఫైళ్లను పరిశీలించే సమయంలో సంబంధిత చట్టాలు, ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులు, నిబంధనలను పూర్తిగా అధ్యయనం చేసి స్పష్టమైన అభిప్రాయంతో ఫైల్‌ను సమర్పించాలన్నారు. ఉద్యోగులు కార్యాలయం పనివేళల్లో సమయపాలన పాటించాలని, బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు. పాత దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా కొత్త ఫైళ్లను ముందుగా పరిష్కరించడం సరికాదని, ముందుగా వచ్చినవాటికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను స్వయంగా గుర్తించి పరిష్కారానికి చొరవ చూపే ఉద్యోగులను తాను గమనిస్తున్నానని తెలిపారు. కలెక్టరేట్‌కు ఉద్యోగులే వెన్నెముక అని, వారు సమర్థవంతంగా పనిచేస్తేనే కార్యాలయానికి మంచిపేరు వస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్‌రెడ్డి, డీఆర్‌ఓ నిర్మల, ఆర్డీఓ నవీన్, తదితరులు పాల్గొన్నారు.


