చెంచుల హక్కు | - | Sakshi
Sakshi News home page

చెంచుల హక్కు

Aug 6 2026 12:57 AM | Updated on Aug 6 2026 12:57 AM

మౌలిక వసతులు పొందడం

అధికారులు సమన్వయంతో పనిచేయాలి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌

మన్ననూర్‌: సగటు మనిషి జీవించేందుకు అవసరమైన మౌలిక అవసరాలు ఆదివాసి చెంచు గిరిజనులకు సమకూర్చాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ షమీమ్‌ అక్తర్‌ అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ చట్టం–1995 ప్రధాన లక్ష్యాలైన మానవ హక్కుల పరిరక్షణ, ప్రోత్సాహం, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ సేవలు సమర్థవంతంగా అందుతున్నాయో లేదో ప్రత్యక్షంగా పరిశీలించే ఉద్దేశంతో ఆయన బుధవారం నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలంలో పర్యటించారు.శ్రీశైలం టీజీజెన్‌న్‌కో కృష్ణవేణి అతిథి గృహంలో ఆయనకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఆర్‌.కోటాజీ ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అమ్రాబాద్‌ ప్రాంతంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, గిరిజనుల సంక్షేమం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల గురించి ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమ్రాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల, శ్రీశైలం డ్యామ్‌, దోమలపెంట గ్రామాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. తదుపరి వటవర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులు, వైద్యులు, సిబ్బందితో మాట్లాడి వైద్యసేవల నాణ్యత, మందుల లభ్యత, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.

● అనంతరం మన్ననూరు కుగ్రామం మల్లాపూర్‌ పెంట గిరిజన ప్రాంతాన్ని సందర్శించి గిరిజనులతో ప్రత్యక్షంగా మమేకమై వారి జీవన పరిస్థితులు, విద్య, ఆరోగ్యం, ఉపాధి, తాగునీరు, సంక్షేమ పథకాల అమలు, ఇతర మానవ హక్కుల సమస్యలను తెలుసుకున్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా.. సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ సందర్భంగా చెంచుపెంటలోని ప్రజలు, మహిళలతో ఇష్టాగోష్టిగా మాట్లాడి పెంటలో చెంచులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు. చెంచు మహిళ మౌనిక మాట్లాడుతూ.. పెంటలో కనీస సౌకర్యాలు, తాగునీటి సమస్య వేధిస్తోందన్నారు. సారవంతమైన వ్యవసాయ భూములు ఉన్నప్పటికీ సేద్యం చేసుకునేందుకు ప్రోత్సాహం లేదన్నారు. గ్రామానికి మొత్తంగా కలుపుకొని ఒక ట్రాక్టర్‌తో పాటు ఒక్కో కుటుంబానికి రెండు ఎద్దులు ఇచ్చినట్లైతే వ్యవసాయం చేసుకొని జీవిస్తామని విజ్ఞప్తి చేశారు. పెంటకు వచ్చి పోయేందుకు సరైన రహదారి లేకపోవడంతో అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్‌ రావడం కూడా కష్టంగా ఉందని చెంచులు వాపోయారు. ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం హెల్త్‌ సెంటర్‌, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని విన్నవించారు. చెంచుల సమస్యలు విన్న షమీమ్‌ అక్తర్‌ పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకునేందుకు సంబంధిత అధికారులతో చర్చిస్తామన్నారు. పెంటలో సెర్ప్‌, అంబుల్‌బీ స్వచ్ఛంద సంస్థ వారు అందజేసిన తేనెటీగల పెంపకం (బాక్సులు) యూనిట్లను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ పల్లె శ్రీనివాస్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ, ఆర్డీఓ యాదగిరి, డీఈఓ రమేష్‌, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి కోటయ్య, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.కృష్ణ, డీటీడీఓ కోటాజీ, ఏఓ జాఫర్‌ హుస్సేన్‌, అమ్రాబాద్‌ తహసీల్దార్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ చంద్రయ్య, ఎఫ్‌ఆర్‌ఓ సవిత, సర్పంచ్‌ మంజుల రాజారాం, ఉప సర్పంచ్‌ రమణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement