ఉపయోగాలు :
అలంపూర్: వానకాలంలో వరినాట్లకు కాలిబాటతో బహుళ ప్రయోజనాలు కలుగుతాయి. విత్తనాలను వెదజల్లినా, డ్రమ్ సీడర్‌తో వెదపెట్టినా..! పొలంలో కాలిబాటలు తీయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జునరెడ్డి రైతులకు సూచించారు. సాగులో ఎదురయ్యే జటిల సమస్యలకు పరిష్కారం చూపేందుకు కాలిబాట దోహదపడుతుందని పేర్కొన్నారు. కాలిబాటలు తీసే విధానం, వాటివల్ల కలిగే లాభాలను వివరించారు.
కాలిబాటలో విత్తే పద్ధతి:
వరినాట్లు వేసేటప్పుడు కాలిబాటలు వేయాలంటే ముందుగానే రెండు గట్ల మధ్య తాళ్లులాగి ఆ ప్రదేశాన్ని వదిలేసి మొక్కలు నాటుకోవాలి. పొలంలో విత్తనాలను వెదజల్లిన రైతులు కూడా కాలిబాటలు తీసుకోవచ్చు. విత్తనాలు చల్లి 15 నుంచి 20 రోజుల్లోగా పైరు ఎదుగుతున్న సమయంలో మొక్కలకు తొలగించి పక్కన నాటుకోవడం ద్వారా బాటలు తీయవచ్చు. ప్రతి 2 మీటర్లకు 20 సెంటీ మీటర్ల వెడల్పులో మొక్కలు తొలగించాలి. డ్రమ్ సీడర్‌తో విత్తనాలు వేసేటప్పుడు ఒక వరుస వేయటం పూర్తయిన తర్వాత 20 సెంటీ మీటర్ల స్థలాన్ని వదిలి మరో వరుసలో విత్తనాలు వేసుకుంటే బాటలు ఏర్పడతాయి.
నాట్లు పూర్తయ్యాక:
వరినాట్లు వేసిన తర్వాత పొలంలో ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీ మీటర్ల వెడల్పున కాలిబాటలు వేయాలి. నాట్లు వేసిన 12 నుంచి 16 రోజుల్లో కాలిబాట తీయడం ఉత్తమం. మందపాటి తాడును చేనుకు అవతలి గట్టుకు ఒకరు, ఇవతలి గట్టుకు పట్టుకోని మరొకరు పట్టుకోని లాగాలి. ఆ తాడు చివర్లకు ఒక కట్టెను కట్టి గట్టు మీద గుచ్చాలి. ఆ తాడుకు 20 సెంటీ మీటర్ల దూరంలో సమాంతరంగా మరొక తాడును ఇదే పద్ధతిలో ఏర్పాటు చేయాలి. రెండు తాళ్ల మధ్య ఉన్న ప్రదేశంలో వచ్చిన మొక్కలను తొలగించి పైరు పలుచగా ఉన్నచోట ఆ మొక్కలను నాటుకోవచ్చు.
చీడ పీడలకు చెక్:
వరి దుబ్బలను ఆశించి పైరును నష్టం కలిగించే బూడిదరంగు దోమ, తెల్లదోమ, పచ్చదీపపు పురుగులను సకాలంలో గుర్తించి వెంటనే సంరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందుకు ఈ బాటలు ఉపయోగకరంగా ఉంటాయి. కాలిబాటలు ఉంటే పొలం నుంచి ఎప్పటికప్పుడు మురుగును తొలగించడం సులువుగా ఉంటుంది. ఈ కారణంగా గొట్టాలపురుగు, నామపురుగు ఉధృతి తగ్గుముఖం పడుతుంది. కాలిబాటల చివర్ల పంగల కర్రలు కడితే పక్షులు వాటిపైకి చేరి హానికారక కీటకాలను తింటాయి.
కాలిబాటల విధానం వలన వరిపైరుకు గాలి వెలుతురు పుష్కలంగా అందుతుంది. కిరణజన్య సంయోగక క్రియ బాగా జరుగుతుంది. మొక్కల్లో పత్ర హరితం అధికంగా ఉత్పత్తి అవుతుంది. పంటకు ఎంత నీరు అవసరమో అంత మేరకు ఎప్పటికప్పుడు బాటలు అందిస్తాయి. సాగునేలలోని సేంద్రియ పదార్థాలు త్వరగా కుళ్లడానికి కాలిబాటలు దోహదపడుతాయి. మొక్కలకు పోషకాలను అందిస్తాయి. మంచి దిగుబడులు పొందేందుకు ఇవి ముఖ్య భూమిక పోషిస్తాయి. పైరు ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. గాలి సమృద్ధిగా మొక్కకు సోకటంతో కావాల్సినంత ఆక్సిజన్‌ను పొందేందుకు మొక్కలకు పెద్దగా ఖర్చు కాదు. కాలిబాటల వలన కలుపు నివారణ పిచికారీలకు కూడా ఎంతో సులువు. ఎరువులను పొలమంతా సమానంగా వేయటం తేలికగా ఉంటుంది. పొలమంతా తిరిగి పైరు ఎదుగుదలను చూసుకోనే అవకాశం ఉంటుంది.


