జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): వీబీజీ రాంజీ (ఉపాధి హామీ) ఉద్యోగులకు పే స్కేల్‌ను అమలు చేసేదాక పోరాటం చేస్తామని వీబీ జీ రాంజీ, ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో జేఏసీ ఆధ్వర్యంలో రాం జీ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీబీ జీ రాంజీ ఉద్యోగులకు ఈ నెల 15లోగా పే స్కేల్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీచేయాలని, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న మూడు నెలల జీతాలు విడుదల చేయాలని, ఎస్‌ఆర్‌డీఎస్ బోర్డు సమావేశంలో ఆమోదించిన అన్ని నిర్ణయాలను తక్షణమే అమలు చేయాలని, సెలవు దినాల్లో పనిచేస్తున్న వారికి ప్రయోజనాలు కల్పించాలని, సీఆర్డీ కార్యాలయంలోని ఫైనాన్స్, హెచ్‌ఆర్ వింగ్ మధ్య సమన్వయ లోపాలను నివారించి వేతనా ల విడుదలలో జాప్యాన్ని శాశ్వతంగా పరిష్కరించాలని, క్యాడర్ స్ట్రెంత్ ఖరారు చేసి పదోన్న తులు, బదిలీలు, కెరీర్ అడ్వాన్స్‌మెంట్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరీ వీడకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్‌డీఓ నర్సింహులుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ కోచైర్మన్ విజయ్‌భాస్కర్, జిల్లా జేఏసీ ప్రచార కార్యదర్శి అస్గర్ అలీ, లక్ష్మీనారాయణ, శాంతికుమార్, హరిచంద్రుడు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


