కల్వకుర్తి రూరల్: విశ్వంలోని సమస్త జీవుల పాపా ల కర్మలను తొలగించే ప్రక్రియ యాగం ద్వారా సిద్ధిస్తుందని కృష్ణ జ్యోతి స్వరూపానందస్వామి అన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న భారతదేశానికి అత్యంత శక్తిని ప్రసాదించే యాగాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయన్నారు. పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ గ్రౌండ్‌లో 91వ విశ్వశాంతి మహా యాగం 8వ రోజు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతోంది. ఆదివారం ఆయుత చండీ, అతిరుద్రం, నవగ్రహ హోమం, నక్షత్రయాగం, సుదర్శన హవనములు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. భగవద్గీత పారాయణం మానవ జీవితాన్ని మారుస్తుందని శ్రీకృష్ణుడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. సాయంత్రం యాగశాల ఆవరణలో ఉమామహేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. 6000 మంది భక్తులకు అన్నదాన వితరణ చేశారు. కార్యక్రమంలో యాగ నిర్వాహకులు జూలూరు రమేష్‌బాబు, కల్వ మనోహర్, బీచని బాలకృష్ణ, పోలా సురేందర్, జూలూరు ప్రకాష్, మురళి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


