రోడ్డు ప్రమాదంలో యువ స్వర్ణకారుడిని కబళించిన మృత్యువు
● ఒకే ఒక్క ఆధారం కోల్పోయిన కుటుంబం
కల్వకుర్తి టౌన్: అమ్మా మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాను.. అని చెప్పిన కొడుకు ఆ మాటే చివరి మాట అయింది. కుమారుడి కోసం ఎదురుచూసిన తల్లికి చివరికి కనిపించింది మాత్రం అతని మృతదేహమే. కుటుంబ భారాన్ని తన భుజాలపై మోస్తూ, కష్టపడి జీవితాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్న యువకుడిని రోడ్డుపై పార్క్ చేసిన భారీ క్రేన్ రూపంలో మృత్యువు కబళించిన ఘటన పట్టణంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. వంగూర్ మండలం కోనేటిపురానికి చెందిన సాయికుమార్ (24) పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో తల్లి, వదిన, ఆమె పిల్లలతో కలిసి నివాసముంటూ స్వర్ణకారుడిగా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. తనకు తెలిసిన వారిని బైక్‌పై శనివారం రాత్రి వంగూర్‌లో దించడానికి వెళ్లి తిరిగి కల్వకుర్తికి బయలుదేరాడు. పట్టణంలోకి చేరుకోగానే అర్ధరాత్రి 12: 30 సమయంలో హైదరాబాద్ చౌరస్తాలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న రోడ్డులో వెనుక నుంచి వస్తున్న వాహనాన్ని తప్పించే సమయంలో అక్కడే రోడ్డుపై పార్కింగ్ చేసిన భారీక్రేన్ ను బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయమైంది. పెట్రోలింగ్ చేస్తున్న బ్లూకోర్టు పోలీస్ సిబ్బంది ఆస్పత్రికి తరలించేలోపే అతను మృతి చెందాడు. అతని ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్ నంబర్లతో వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పట్టణంలోని సీహెచ్‌సీ మార్చురీకి తరలించారు.
మగదిక్కును కోల్పోయామని..
కుటుంబంలోని మగవారంతా ఏదో కారణాలతో మృతి చెందటంతో, కుటుంబ బాధ్యతలు సాయికుమార్‌పై పడ్డాయి. సొంత గ్రామంలో కలిసి రాకపోవటంతో, కల్వకుర్తి పట్టణానికి వచ్చి వారి జీవనాన్ని సాగిస్తున్నారు. ఉన్న ఒక్క కుమారుడిని చూసుకుంటూ జీవితాన్ని సాగిద్దామని అనుకున్న ఆ తల్లికి ఉన్న కుమారుడు సైతం రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో ఆస్పత్రిలో వారు రోదిస్తున్న తీరు అందరిని కలిచివేసింది.
సాయికుమార్
(ఫైల్)


