బిల్లులు చెల్లించాల్సిందే..
ఇప్పుడెలా కట్టేది..?
గడిచిన ఆరునెలల్లో ఉమ్మడి జిల్లాలో జీపీలకు వచ్చిన కరెంట్ బిల్లులు ఇలా (రూ.లలో)..
పంచాయతీలకు గుదిబండగా విద్యుత్ బిల్లుల చెల్లింపు
● ఎండిపోయిన బోర్లకూ మీటర్లు..
పేరుకుపోతున్న బకాయిలు
● ఇప్పటికే ఖర్చయిన
15వ ఆర్థిక సంఘం నిధులు
● బిల్లులు చెల్లించేందుకు
చిల్లిగవ్వ లేని వైనం
కల్వకుర్తి టౌన్: గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కింద విడుదల చేసిన నిధులు ప్రస్తుతం విద్యుత్ బిల్లుల భారాన్ని మోయలేని పరిస్థితిని తెచ్చాయి. గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనుల కోసం వినియోగించిన ఈ నిధుల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులకు అవసరమైన మొత్తాన్ని కేటాయించకపోవడంతో ఇప్పుడు పంచాయతీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. తాగునీటి సరఫరా బోర్లు, వీధిదీపాలకు సంబంధించిన బిల్లులు నెలనెలా పేరుకుపోతుండగా.. వాటిని చెల్లించేందుకు పంచాయతీల ఖాతాల్లో చిల్లిగవ్వ లేక సర్పంచులు ఆందోళన చెందుతున్నారు.
నిధులున్నాయి.. కానీ, బిల్లులకు లేవు
15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు విడుదలైన సమయంలో వాటిలో కొంత మొత్తాన్ని విద్యుత్ బిల్లుల కోసం కేటాయించాల్సి ఉన్నప్పటికీ, చాలా గ్రామాల్లో వాటిని సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, భవనాల మరమ్మతు తదితర అభివృద్ధి పనులకు వినియోగించారు. అప్పట్లో విద్యుత్ బిల్లులపై సరైన ప్రణాళిక లేకపోవడంతో ప్రస్తుతం బకాయిలు భారీగా పేరుకుపోయాయి.
వాటితో అదనపు భారం..
గ్రామాల్లో తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన బోర్లు, మోటార్లు, వీధి దీపాలకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం నీరు రాని, ఎండిపోయిన బోర్లు వినియోగంలో లేకపోయినా వాటి కనెక్షన్లు కొనసాగుతుండటంతో బిల్లులు వస్తూనే ఉన్నాయి. ఉపయోగం లేని కనెక్షన్లను తొలగించకపోవడం కూడా పంచాయతీలపై అదనపు భారం పడేలా చేస్తోంది.
ప్రస్తుతం చెల్లింపుపై ఒత్తిడి
ప్రస్తుతం విద్యుత్ శాఖ బిల్లుల చెల్లింపుపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు పంచాయతీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పంచాయతీ ఖాతాల్లో తగినంత నిధులు లేకపోవడంతో బిల్లులు చెల్లించేందుకు సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సైతం నూతనంగా ఏర్పడిన పాలకవర్గాల కాలంలోని జనవరి 26, 2026 నుంచి ప్రస్తుతం వరకు విద్యుత్ బిల్లులు చెల్లించాలని చెబుతుంది. అయితే విద్యుత్ బిల్లుల సమస్యతో గ్రామాల్లో తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని సర్పంచులు కోరుతున్నారు. అలాగే వినియోగంలో లేని బోర్ల విద్యుత్ కనెక్షన్లను రద్దు చేసి, భవిష్యత్‌లో ప్రతి నెల విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పేర్కొంటున్నారు.
జిల్లాలోని అన్ని పంచాయతీలకు విద్యుత్ బిల్లులు కట్టాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం. కేవలం నూతన పాలకవర్గాలు ఏర్పడిన నాటి నుంచే కట్టాలని ప్రభుత్వం పేర్కొంది. చాలావరకు జీపీలు బిల్లులు కడుతున్నా.. మరికొన్ని జీపీల వద్ద 15వ ఆర్థిక సంఘం నిధులను వేరే పనులకు వాడామని సర్పంచులు చెబుతున్నారు. కానీ, విద్యుత్ బిల్లులు తప్పనిసరిగా కట్టాల్సిందే.
– శ్రీరాములు, డీపీఓ, నాగర్‌కర్నూల్
15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాక వాటితోనే జీపీ వర్కర్ల జీతాలు, పలు ఈఎంఐలతోపాటు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాం. ఇప్పుడేమో విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. నిధులు ఖర్చు అయ్యాక బిల్లులు కట్టాలని ఒత్తిడి చేయడం సమంజసం కాదు. కాబట్టి జీపీలకు గుదిబండగా మారిన విద్యుత్ బిల్లుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి.
– ఽశ్రీనివాసులు, సర్పంచ్, చెర్కూర్, వెల్దండ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా


