వంగూరు: రేగుచెట్టును తొలగిస్తుండగా కందిరీగలు దాడి చేయడంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన రైతు మధు(41) ఆదివారం ఉదయం తన భార్య పార్వతమ్మతో కలిసి సొంత భూమిలో రేగిచెట్టును తొలగిస్తుండగా చెట్టుకు ఉన్న కందిరీగలు మధు వెంటపడి దాడి చేసి కరిచాయి. దీంతో పరుగెత్తే క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన మధును భార్య స్థానికుల సహాయంతో వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మధు భార్య పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు.
ప్రేమించమని వేధించిన యువకుడి అరెస్ట్
మద్దూరు (కోస్గి): మద్దూరు మండల పరిధిలోని పెదిరిపాడ్ కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాలలో ఈ నెల 14న అమ్మాయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కేసులో యువకుడిని ఆదివారం మద్దూరు పోలీసులు అరెస్టు చేశారు. యువకుడు ప్రేమించమని వేధించడంతోనే తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నారాయణపేట మండలం బొమ్మన్‌పాడ్‌కు చెందిన సాయి కార్తీక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు మద్దూరు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
బ్యాంకుల వద్ద
వృద్ధులే టార్గెట్!
● అంతర్రాష్ట్ర మోసగాళ్లు అరెస్ట్
నారాయణపేట: బ్యాంకులకు నగదు లావాదేవీల కోసం వచ్చే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మాయమాటలతో నగదు అపహరిస్తున్న ఇద్దరు నిందితులను నారాయణపేట రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.35,800 నగదు, మోటార్ సైకిల్, మొబైల్, ఫ్రిజ్, స్మార్ట్ టీవీని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శివశంకర్ ఆదివారం తెలిపారు. చిన్నజట్రం వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ నిందితుడు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వెంటాడి పట్టుకొని విచారించగా నేరాలను ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో చీరాల ఈశ్వరయ్య అలియాస్ శివ అలియాస్ మీసమోడా (43)తో పాటు చీరాల రాధ అలియాస్ లక్ష్మి (43)ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు చీరాల ఈశ్వరయ్యపై జిల్లాలో మొత్తం 15 క్రిమినల్ కేసులు ఉన్నాయని వనపర్తి జిల్లాలో రెండు సార్లు పీడీ యాక్ట్ కింద జైలుకు కూడా వెళ్లినట్లు తెలిపారు.
సులభంగా డబ్బులు సంపాదించాలని..
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నిందితులు బ్యాంకులకు వచ్చే వృద్ధులను టార్గెట్ చేసి ‘మీ కుమారుడు, కుమార్తె మాకు తెలుసు‘ అంటూ పరిచయం ఉన్నట్లుగా మాట్లాడి నమ్మకం కల్పిస్తారు. అనంతరం వారి వద్ద ఉన్న నగదు తీసుకుని చిన్న పని చెప్పి పంపించి, బాధితులు తిరిగి వచ్చేలోపే అక్కడి నుంచి పరారయ్యేవారు. తర్వాత మళ్లీ ఇతర ప్రాంతాల్లో ఇదే తరహా నేరాలకు పాల్పడేవారని పోలీసులు వెల్లడించారు.


