కోస్గి రూరల్: కారు, స్కూల్ బస్సు ఢీకొట్టుకోవడంతో ఇద్దరి పరిస్థితి విషమంగా మారిన ఘటన గుండుమాల్ మండల పరిధిలోని బోగారం గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ మున్సిపాలీటికి చెందిన ఫాహద్ బిన్ రయిస్, షాహద్ బిన్ రయిస్‌లు ఇద్దరు అన్నదమ్ములు. వీరు నారాయణపేట్ జిల్లాలోని మద్దూర్ మున్సిపాలీటీ కేంద్రంలో నిర్వహిస్తున్న మదర్సాకు ఇన్‌చార్జిలుగా పనిచేస్తున్నారు. తమ కార్యకలాపాలను ముగించుకొని కారులో స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో కోస్గిలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు విద్యార్థులను వదిలిపెట్టేందుకు వెళ్తుండగా బోగారం గ్రామ శివారులో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలు కాగా 108లో కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో పాలమూర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో విద్యార్థులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. క్షతగాత్రుల బంధువు షేక్ తహసిన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పురుషోత్తం తెలిపారు.


