జడ్చర్లకు తాగునీటి ముప్పు | - | Sakshi
Sakshi News home page

జడ్చర్లకు తాగునీటి ముప్పు

Jul 16 2026 7:12 AM | Updated on Jul 16 2026 7:12 AM

జడ్చర్ల టౌన్‌: జడ్చర్ల మున్సిపాలిటీకి తాగునీటి ముంపు ముంచుకొస్తుంది. అదేంటి మిషన్‌ భగీరథ పథకం ఉండగా.. నీటి ఎద్దడి ఎందుకు వస్తుందని సందేహం వస్తుందా.. కానీ, మున్సిపాలిటీలో నిజంగానే తాగునీటి ఎద్దడి తలెత్తనుంది. గత ప్రభుత్వ హయాంలో అధికారులు చేసిన చిన్నపాటి తప్పిదం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. దీంతో ప్రస్తుత మున్సిపాలిటీ అధికారులు సైతం ఎప్పుడు నీటి సరఫరా ఆగిపోతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు.

పాత పైపులైన్‌తో సరిపెట్టి..

మల్లెబోయిన్‌పల్లి వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నుంచి కావేరమ్మపేట ఓహెచ్‌బీఆర్‌కు నీటి సరఫరా కోసం సుమారు 5 కి.మీ., కొత్తగా పైప్‌లైన్‌ వేయాల్సి ఉన్నప్పటికీ పాత పైప్‌లైన్‌ బాగుందని ప్రతిపాదనలు పెట్టలేదు. దీంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అప్పటి ఎమ్మెల్యే మల్లురవి కృషితో వేసిన పైప్‌లైన్‌ అలాగే వినియోగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి అప్పట్లో వేసిన పైప్‌లైన్‌ కోసం జీఆర్‌పీ పైపులు వినియోగించారు. ఈ పైపులు నాణ్యతతోపాటు బరువు తక్కువగా ఉంటాయి. అయితే పైప్‌లైన్‌ లీకేజీ వస్తే మాత్రం మరమ్మతు చేసేందుకు సమయం పడుతుంది. పైపులలో నీటి సరఫరా ఉన్నంత వరకు ఎలాంటి లీకేజీలు జరగవు. ఒకవేళ నీటి సరఫరా ఆగితే మాత్రం లీకేజీలు వెంటాడుతాయి. వారం రోజుల కిందటే కావేరమ్మపేట సమీపంలో పైప్‌లైన్‌ లీకేజీ కావడం వల్ల మరమ్మతు చేసేందుకు నాలుగు రోజుల సమయం పట్టింది. దీంతో మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులకు నీటి సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తాయి. ఇలా నెలలో ఒకటి, రెండుసార్లు లీకేజీలు వెంటాడుతున్నాయి. 5 కి.మీ., మేర ఉన్న పైప్‌లైన్‌ మార్చితే గాని మున్సిపాలిటీకి తాగునీటి గండం తప్పే పరిస్థితి కనిపించడం లేదు.

కొత్త పైపులైన్‌ వేయాలంటే..

మల్లెబోయిన్‌పల్లి వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నుంచి కావేరమ్మపేట ఓహెచ్‌బీఆర్‌ వరకు కొత్తగా పైప్‌లైన్‌ వేయాలంటే రూ.11 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఈ వ్యయాన్ని భరించేందుకు మిషన్‌ భగీరథ సిద్ధంగా లేదు. దీంతోపాటు మున్సిపాలిటీలోనూ నిధుల కొరత వేధిస్తుంది. దీంతో పైప్‌లైన్‌ ఎప్పుడు మారుస్తారో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా పైప్‌లైన్‌ లీకేజీ కావొద్దంటూ వాటర్‌ సిబ్బంది వేడుకుంటూ కాలం గడుపుతున్నారు. అయితే మున్సిపల్‌ శాఖ మంత్రి సీఎం పరిధిలోనే ఉండటంతో ప్రతిపాదనలు ఆయన టేబుల్‌పై ఉన్నాయని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు.

పైప్‌లైన్‌ లీకేజీ మరమ్మతు (ఫైల్‌)

కావేరమ్మపేట సబ్‌స్టేషన్‌ సమీపంలో

జీఆర్‌పీ పైప్‌లైన్‌ లీకేజీ పనులు (ఫైల్‌)

రెండు విధాలుగా సరఫరా..

జడ్చర్ల మున్సిపాలిటీకి మిషన్‌ భగీరథ ద్వారా రెండు విధాలుగా నీటి సరఫరా అవుతుంది. నాగసాల వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నుంచి కొత్తబజార్‌ ప్రాంతం అంతటికీ నీటి సరఫరా అవుతున్నాయి. ఈ ప్లాంట్‌ ద్వారా నిత్యం 2.70 ఎంఎల్‌డీ నీటి పంపిణీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరుగుతుంది. అయితే మల్లెబోయిన్‌పల్లి వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నుంచి నిత్యం 11 ఎంఎల్‌డీల నీటి పంపిణీ జరగాల్సి ఉంది. కానీ, ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. తరచుగా పైప్‌లైన్‌ల లీకేజీలు అంటూ పంపిణీ సక్రమంగా జరగడం లేదు. మల్లెబోయిన్‌పల్లి డబ్ల్యూటీపీ నుంచి కావేరమ్మపేట ఓహెచ్‌బీఆర్‌కు నీటి పంపిణీ చేసి అక్కడి నుంచి మున్సిపాలిటీలోకి సరఫరా చేస్తుండగా.. ఇక్కడే అసలు సమస్య నెలకొంటుంది.

మల్లెబోయిన్‌పల్లి డబ్ల్యూటీపీ నుంచి కావేరమ్మపేట ఓహెచ్‌బీఆర్‌కు సరఫరా లోపం

గత అధికారుల తప్పిదంతో

మార్చని జీఆర్‌పీ పైప్‌లైన్‌

తరచూ లీకేజీలతో

నీటి సరఫరాకు అంతరాయం

పైప్‌లైన్‌ మార్చేందుకు రూ.11 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement