దేవరకద్ర: ఉల్లి ధర వినియోగదారునికి చుక్కలు చూపిస్తుండగా.. రైతులకు కాసుల పంట పండుతోంది. ఈసారి సీజన్‌లో నమోదైన ధరలతో పోల్చితే దాదాపు వందశాతం పెరిగింది. ఈ ఏడాది ఉల్లి సీజన్‌లో జనవరి నుంచి మే వరకు 5 నెలలపాటు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు పలికింది. జూన్‌లో రూ.2,000 నుంచి రూ.2,400 వరకు, జూలై రెండో బుధవారం ఏకంగా రూ.2,500 నుంచి రూ.3,300 వరకు ఉల్లి ధరలు నమోదయ్యాయి. సీజన్‌లో అమ్ముకున్న రైతుల కన్నా ప్రస్తుతం అమ్ముకుంటున్న రైతులు వందశాతం లాభాలు పొందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి దిగుబడులు లేకపోవడంతో యాసంగిలో పండించిన ఉల్లిని నిల్వ చేసిన రైతులు ఇప్పుడు మార్కెట్‌కు తీసుకువస్తుండగా అధిక ధరలు పలుకుతున్నాయి.
ఉల్లి అమ్మకాలకు ప్రసిద్ధి..
ఉమ్మడి జిల్లాలోనే ఉల్లి క్రయ విక్రయాలకు దేవరకద్ర మార్కెట్ ప్రసిద్ధిగా మారింది. ప్రతి బుధవారం ఇక్కడి మార్కెట్‌లో కేవలం ఉల్లిపాయలు మాత్రమే బహిరంగ వేలం వేసి ధరలు నిర్ణయిస్తారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రైతులు దేవరకద్ర మార్కెట్‌కు ఉల్లిని అమ్మకానికి తెస్తారు. ప్రధానంగా నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి దేవరకద్ర మార్కెట్‌కు ఉల్లి అమ్మకానికి వస్తుంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు గ్రామాల రైతులు పండించిన ఉల్లి అంతా దేవరకద్ర మార్కెట్‌కే అమ్మకానికి తెస్తారు. ఏడాదిలో వచ్చే 56 బుధవారాలు ఉల్లి వ్యాపారంతోనే మార్కెట్ సందడిగా ఉంటుంది.
అన్నదాతల ఆనందం..
ఉల్లి ధరలు పెరగడంతో రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. నిల్వ చేసుకున్నందుకు ఫలితం దక్కిందని పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ప్రారంభంలో అమ్మిన ఉల్లికి వచ్చిన ధరలతో పోల్చితే ప్రస్తుతం రెండు, మూడింతల ధరలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. బుధవారం దేవరకద్ర మార్కెట్‌లో జరిగిన వేలంలో క్వింటా ఉల్లి గరిష్టంగా రూ.3,300, కనిష్టంగా రూ.2,500 వరకు ధరలు నమోదయ్యాయి. సన్నటి ఉల్లి గరిష్టంగా రూ.2,200, కనిష్టంగా రూ.1,600 వరకు పలికింది. మార్కెట్ నిబంధనల ప్రకారం 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.1,700, కనిష్టంగా రూ.1,300 చొప్పున, సన్నటి ఉల్లి బస్తా గరిష్టంగా రూ.1,100, కనిష్టంగా రూ.800 వరకు విక్రయించారు. చిల్లర వ్యాపారులు కిలో ఉల్లి ఏకంగా రూ.30–40 వరకు విక్రయిస్తుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
నిల్వ చేసుకున్న రైతుకు లాభాల పంట
క్వింటా గరిష్టంగా రూ.3,300,కనిష్టంగా రూ.2,500
క్రమంగా పెరుగుతున్న ధరలతో వినియోగదారుల ఆందోళన


