● ‘పాలమూరు’ ప్రాజెక్టు సలహాదారు పెంటారెడ్డి
కొల్లాపూర్ రూరల్: పాలమూరు– రంగారెడ్డి మొదటి లిస్టు ద్వారా నెల వ్యవధిలో పూర్తయిన నాలుగు పంపుల ద్వారా నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రాజెక్టుల సలహాదారు పెంటారెడ్డి అన్నారు. మంగళవారం పంపుల విధివిధాలపై ఉన్నతాధికారులతో కంట్రోల్ బోర్డులో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత మూడేళ్ల క్రితం ప్రారంభించిన మొదటి పంపులో చాలా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పరిష్కరించేందుకు దాదాపు 10 రోజుల సమయం పట్టిందన్నారు. అన్నిరకాల సాంకేతిక సమస్యలను అధిగమించి మంగళవారం దాదాపు గంటపాటు నీటిని రిజర్వాయర్‌లోకి విడుదల చేశామన్నారు. బుధవారం నుంచి రెండో పంపు డ్రైరన్ ప్రారంభిస్తామని, వారం రోజుల్లో రెండో పంపు నుంచి నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. మోటార్లలో తలెత్తుతున్న చిన్నపాటి సమస్యలు పరిష్కరిస్తూ.. నాలుగు పంపుల నుంచి నెల వ్యవధిలో రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తామన్నారు. కృష్ణానదికి నీళ్లు వచ్చే వరకు నాలుగు పంపులు సిద్ధం చేస్తామన్నారు. అలాగే ప్యాకేజీ–3లో ఉన్న పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయన్నారు. ఏదుల, వట్టెం, కర్వెనలో ఉన్న పంపులను సైతం సిద్ధం చేసి.. అన్ని రిజర్వాయర్లకు త్వరలో నీటిని తరలించాలని సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఎస్‌ఈ రవీందర్, ఈఈ లోకిలాల్, డీఈ ప్రవీణ్ తదితరులున్నారు.


