అధికారుల పొలం బాట | - | Sakshi
Sakshi News home page

అధికారుల పొలం బాట

Jul 16 2026 7:12 AM | Updated on Jul 16 2026 7:12 AM

గ్రామాల్లో పర్యటిస్తున్న ఏఓలు, ఏఈఓలు

వరి సాగుపై పునరాలోచన చేయాలని రైతులకు సూచన

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): జిల్లా వ్యవసాయ శాఖ సూచనల మేరకు కిందిస్థాయి అధికారులు పొలాల బాట పట్టారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులపై రైతులకు సూచనలు చేశారు. వరి నారుమళ్లు పోసి నష్టపోకుండా ప్రత్యామ్నాయంగా కందులు, మొక్కజొన్న, ఆముదం వంటి ఆరుతడి పంటలు సాగు చేసేలా విస్తృత ప్రచారం నిర్వహించినట్లు సమాచారం. ‘వానల్లేవ్‌.. సాగులేదు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం రాష్ట్ర వ్యవసాయ శాఖలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, వరి సాగుపై ఎదురయ్యే నష్టాలను కథనం ద్వారా ప్రస్తావించడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ స్పందించినట్లు తెలిసింది. రైతులకు వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన ఉండటంతో ఈ సమయంలో పంటల సాగు పరిస్థితులపై వచ్చిన కథనం వ్యవసాయ శాఖలో కలకలం రేపినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్‌నాయక్‌ ఏఓలు, ఏఈఓలకు ప్రత్యేకంగా సూచనలు చేసినట్లు తెలిసింది. తక్షణమే గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

మాచన్‌పల్లిలో రైతులతో చర్చ

‘సాక్షి’ కథనంలో ఫొటో వచ్చిన మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం మాచన్‌పల్లి గ్రామ రైతు మల్లు వెంకటేశ్వర్‌రెడ్డి పొలాన్ని ఏఓ శ్రుతి, ఏఈఓలు హనీఫ్‌, నాగార్జున సందర్శించారు. వరి నారుమడిని పరిశీలించి రైతుతో మాట్లాడారు. ఎన్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నందున అధిక నీరు అవసరమయ్యే వరికి బదులుగా ఆరుతడి పంటల వైపు మళ్లాలని సూచించారు. గ్రామ రైతులతో సమావేశం నిర్వహించి వర్షాభావ పరిస్థితుల్లో అనుసరించాల్సిన సాగు విధానాలపై అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement