● ఈ–పాస్ సాంకేతిక లోపంతో
నిలిచిన లావాదేవీలు
● ఉదయం నుంచి వేచిచూసిన కార్డుదారులు
● పంపిణీ వివరాలపై స్పష్టత ఇవ్వని
అధికారులు
మహబూబ్‌నగర్ రూరల్: నిరుపేదలకు ప్రతి నెల చౌకధర దుకాణాల ద్వారా పంపిణీ చేసే ఉచిత బియ్యం పంపిణీకి సోమవారం సాంకేతిక సమస్యలు ఆటంకం కలిగించాయి. జిల్లాలోని రేషన్ దుకాణాల్లో ఉపయోగించే ఈ–పాస్‌యంత్రాల్లో సర్వర్ పనిచేయకపోవడంతో ఉదయం నుంచే పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో రేషన్ కోసం వచ్చిన కార్డుదారులు దుకాణాల వద్ద నిరీక్షించాల్సి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 506 చౌకధర దుకాణాలు ఉండగా, 2,78,386 రేషన్ కార్డులు, 9,50,934 యూనిట్లు ఉన్నాయి. వీరికి నెలకు 6,045.496 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీలోగా ప్రభుత్వం బియ్యం పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సర్వర్ సమస్యతో పలుచోట్ల పంపిణీకి అంతరాయం ఏర్పడింది. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గంప శ్రీనివాసును ఈ విషయమై సంప్రదించగా.. శ్రీసర్వర్ అప్‌డౌన్ కావడం సర్వసాధారణమే. సాంకేతిక సమస్య కారణంగా కొంత ఇబ్బంది ఏర్పడింది’ అని తెలిపారు. జూలై నెలలో ఇప్పటివరకు ఎంతమంది కార్డుదారులకు బియ్యం పంపిణీ పూర్తయిందని అడుగగా.. ఇంకా అప్‌డేట్ కాలేదని ఆయన చెప్పారు. సాంకేతిక సమస్యలు తరచూ తలెత్తుతున్న నేపథ్యంలో రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్వహించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


