అనుమానాస్పదంగా యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదంగా యువకుడు మృతి

Jul 12 2026 1:47 AM | Updated on Jul 12 2026 1:47 AM

గద్వాల క్రైం: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందిన ఘటన గద్వాల జిల్లాకేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని సుంకులమ్మమెట్‌ కాలనీకి చెందిన నరేందర్‌ (23), మరో నలుగురు యువకులు కాలనీ సమీపంలోని నవరంగ్‌ థియేటర్‌ పై అంతస్తులో మద్యంతో పాటు (నిషేధిత మత్తు పదార్థం) తాగారు. ఈ క్రమంలో నరేందర్‌ మూత్ర విసర్జన చేసేందుకు వెళ్లిన క్రమంలో పై అంతస్తు నుంచి కింద పడిపోయాడు. గమనించిన స్నేహితులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కాగా, తన కుమారుడిని స్నేహితులు అందరూ కలిసి పథకం ప్రకారమే హత్యచేసి ఉంటారని తల్లి సువర్ణ అరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్‌ తెలిపారు.

భార్యాపిల్లలు దూరమయ్యారని వ్వక్తి ఆత్మహత్య

మిడ్జిల్‌: కుటుంబ కలహాలతో భార్యాపిల్లలు తనను విడిచి వెళ్లడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మిడ్జిల్‌ మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు.. వంగూరుకు చెందిన ప్రసాద్‌ (40) 20ఏళ్ల నుంచి మిడ్జిల్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. కుటుంబ కలహాలతో కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మానసికంగా కుంగిపోయిన ప్రసాద్‌.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

అనుమానాస్పద వ్యక్తికి దేహశుద్ధి

మానవపాడు: రాత్రివేళ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన మానవపాడు మండలం చంద్రశేఖర్‌నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఝార్ఖండ్‌కు చెందిన రతీయా ఒమరు శనివారం తెల్లవారుజామున చంద్రశేఖర్‌నగర్‌ గ్రామంలోని శ్రీనగర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. స్థానికులు పట్టుకుని నిలదీశారు. ఆ పక్కనే గొర్రెల మంద ఉండటం.. అతడు సరైన సమాధానం చెప్పకపోవడంతో దొంగతనం చేసేందుకే వచ్చాడని అనుమానిస్తూ దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు. కాగా, అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదని తెలిసింది. పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

బైక్‌ ఢీ.. వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌ క్రైం: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనదారుడు వేగంగా ఢీకొట్టడంతో మృతి చెందాడు. రూరల్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం..నారాయణపేట పట్టణంలోని శివాజీ నగర్‌కు చెందిన నారాయణ(49) శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్‌ మండల పరిధిలోని ధర్మపూర్‌ దగ్గర రోడ్డు దాటుతున్న క్రమంలో ఏపీ 22 జీ6378 నంబర్‌ కలిగిన బైక్‌ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో నారాయణకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన అతనిని చికిత్స కోసం జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement