● అక్కడికక్కడే మృతి
● గొంతు, ఛాతి, పొట్టలో పొడిచిన వైనం
● పరారీలో నిందితుడు
గద్వాల క్రైం: వృద్ధురాలిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గద్వాల పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బీసీ కాలనీలో నివాసం ఉంటున్న తెలుగు శంకరమ్మ(65)తో గుర్తు తెలియని దుండగుడు శనివారం మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడి ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కత్తితో గొంతు కోశాడు. అక్కడితో ఆగకుండా ఛాతి, పొట్టలో పలుమార్లు పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడు పరారయ్యాడు.
డీసీఎం డ్రైవర్‌పై అనుమానం..
వృద్ధురాలిపై దాడి చేసింది ఆమెకు వరుసకు కుమారుడైన డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తిగా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం ఆమెతో సదరు వ్యక్తి ఘర్షణ పడ్డాడని, కుటుంబ సభ్యులు తీవ్రంగా మందలించి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. అప్పటి నుంచి మనసులో పెట్టుకుని హత్యకు పాల్పడి ఉంటాడని ఆరోపిస్తున్నారు. మృతురాలి భర్త మెకల కృష్ణ రెండేళ్ల క్రితం మృతి చెందాడు. వీరికి అయిదుగురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం చిన్న కూతురు మృతురాలి యోగక్షేమాలు చూసుకుంటుంది. పట్టపగలే హత్య జరగడంతో కాలనీవాసులు భయదోళనకు గురయ్యారు.
గాలింపు చర్యలు..
స్థానికుల సమాచారంతో సీఐ శ్రీను, ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుమార్తె జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని హత్యకు గల కారణాలు వెల్లడిస్తామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.


