స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని కంచికామకోటి పీఠం పాలమూరు శాఖ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 34వ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు శనివారం ఉదయం వేద పారాయణాలు, మూలమంత్ర అనుష్టానాలు, స్వామివారి మూలమూర్తికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం తిరుపతి నుంచి వచ్చిన కళాకారులు వాద్య సంగీత కచేరీ నిర్వహించారు. హంస వాహనంపై స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు. గోవిందనామంతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యాన్ని చాటింది. బ్రహ్మోత్సవాల్లో శ్రీవెంకటేశ్వర సేవా మండలి అధ్యక్షులు తోటపల్లి శ్రీకాంత్‌శర్మ, ప్రధాన కార్యదర్శి గొండ్యాల రాఘవేంద్రశర్మ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జీపీల సమగ్రాభివృద్ధికి పాటుపడాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామ సమగ్రాభివృద్ధికి కలిసికట్టుగా పాటుపడాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. కలెక్టరేట్‌లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం రెండోరోజు ముగిసింది. అడ్డాకుల, రాజాపూర్, జడ్చర్ల, చిన్న చింతకుంట, దేవరకద్ర, కోయిలకొండ, గండీడ్, మహమ్మదాబాద్ 8 మండలాలకు సంబంధించిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. జీపీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మంజూరైన పనులు, నిధులు తదితర వివరాల సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ఇందుకు రూపొందించిన ప్రొఫార్మాలను పంచాయతీ కార్యదర్శులు పూర్తిచేసి వారం రోజుల్లోగా అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ అంతరాయం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా కేంద్రంలోని 132 /33 కేవీ సబ్ స్టేషన్ అత్యవసర పరిస్థితి నిర్వహణ కారణంగా శనివారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతయారం ఉంటుందని పట్టణ ఏడీ తవుర్యా నాయక్ శుక్రవారం ఓ ప్రకనటలో తెలిపారు. ఉదయం 7 నుంచి 8 వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తామని, అలాగే 11 కేవీ వీరన్నపేట ఫీడర్, నవాబ్‌పేట్ రోడ్డు 11 కేవీ రోడ్ ఫీడర్ పై చెట్ల కత్తిరింపు కోసం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు. దీంతో నవాబ్‌పేట్ రోడ్, న్యూగంజ్, మోతీనగర్, బోయపల్లి గేట్ సంజయ్‌నగర్, వీరన్నపేట్, కోయిల్‌కొండ రెండు సడాకులు, పాలిటెక్నిక్ కళాశాల, డబుల్ బెడ్‌రూమ్, పూజారి తండా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
విద్యా సంస్థల బంద్ ప్రశాంతం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పలు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో జిల్లావ్యాప్తంగా బంద్ చేపట్టారు. ఈ సందర్బంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వాలని, ఎంఈఓ, డీఈఓ పోస్టులు భర్తీ చేయాలని, కళాశాలల్లో అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వం ఏర్పడి ఏళ్లు గడుస్తున్న ఇంకా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం విడ్డూరం అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకపోగా ప్రైవేటు సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టడం లేదన్నారు. బడుల్లో తాగునీరు, మరుగుదొడ్లు వంటి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం వెంటనే డిమాండ్లను నెరవేర్చలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపడతామన్నారు. రాజు, భరత్, లక్ష్మ ణ్, సీతారాం, రాజశేఖర్, మారుతి, శేఖర్, లింగం, ధర్మతేజ, విజయ్, సతీష్ పాల్గొన్నారు.


