● ఎన్యూమరేషన్ ఫారాల
డిజిటలైజేషన్ కోసం..
● యాప్ స్కానింగ్ అంతరాయం
లేకుండా చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఓటరు జాబితా ప్రత్యేకస మగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు బీఎల్‌ఓ (బూత్ లెవల్ ఆఫీసర్)లకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ఓటర్లు నింపి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌ఓలు యాప్ డిజిటైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు సెల్‌ఫోన్‌లో బ్యాటరీలో సమస్య తలెత్తకుండా వారికి పవర్ బ్యాంకులు ఇచ్చారు. అలాగే ప్రస్తుతం వర్షా కాలం కావడంతో రెయిన్ కోర్టులు, గొడుగులు కూడా పంపిణీ చేశారు. టోపీలు, టీషర్టులు, పెన్నులు, నోట్‌పుస్తకాలు ఇలా పలు రకాల వస్తువులతో కూడిన కిట్టు అందజేశారు. ఇళ్ల వద్దకు సుమారు మూడు నుంచి నాలుగు పర్యాయాలు తిరగాల్సి ఉంటుంది. కలర్ ఫొటో ఇవ్వకపోతే.. ఓటరు లైవ్ ఫొటో దించి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియపై ఇటీవలే బీఎల్‌ఓలకు శిక్షణ సైతం ఇచ్చారు.
● ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో బీఎల్‌ఓలు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో బీఎల్‌ఓ సగటున 800 నుంచి వెయ్యి వరకు ఫారాలను పంపిణీ చేయాలి. ఒక్కో ఓటరుకు రెండేసి ఇస్తారు. ఈ లెక్కన సుమారు 1,600 నుంచి రెండు వేల ఫారాలను ఓటర్ల ఇంటికి చేర్చాల్సి ఉంటుంది. దీంతో వీటిని మోసేటప్పుడు బీఎల్‌ఓలు ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చిన బ్యాగులు కూడా చాలా వరకు డ్యామేజీ అవుతున్నాయి. కాగా జిల్లాలో 7,32,488 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,61,863, మహిళలు 370600 మంది, 25 మంది ఇతరులు ఉన్నారు.


