● బాధితులకు సత్వర న్యాయం అందించాలి
● గంజాయి వినియోగంపై నిఘా పెంచాలి: ఎస్పీ డి.జానకి
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో గంజాయితో పాటు ఇతర మాదకద్రవ్యాల సరఫరా, వినియోగం కట్టడికి ప్రత్యేక చర్యలు చేపడంతో పాటు నిఘా పెట్టాలని ఎస్పీ డి.జానకి పోలీస్ అధికారులను ఆదేశించారు. సీసీటీఎన్‌ఎస్ నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం ఉండరాదని, రికార్డులు సకాలంలో అప్‌డేట్ చేయాలన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దొంగతనాలు, నేరాలు కట్టడికి ప్రతి గ్రామం, మండల కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన పెంచి కెమెరాలు ఏర్పాటు చేయించాలన్నారు. ప్రతి స్టేషన్ పరిధిలో ఉండే పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం చేయాలన్నారు. ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సకాలంలో పూర్తి చేయాలన్నారు. కేసుల దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నిరంతర పర్యవేక్షణలో ఉండాలన్నారు. ప్రధానంగా సీసీటీఎన్‌ఎస్ నిర్వహణలో భాగంగా రికార్డులను నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద మాదకద్రవ్యాల విక్రయాలు, నిల్వ, రవాణా వాటిని గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల కట్టడితో పాటు దొంగతనాల కేసుల్లో నిందితులను త్వరగా గుర్తించి, అరెస్టు చేసి రికవరీ పెంచాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, గిరికుమార్, సీఐలు అప్పయ్య, గాంధీనాయక్, కమలాకర్, మహేష్, నర్సింహులు, ఐటీ సెల్ ఎస్‌ఐ రవి ఇతర ఎస్‌ఐలు పాల్గొన్నారు.


