● తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
● నిందితులను రిమాండ్‌కు
తరలించిన పోలీసులు
కందనూలు: పట్టపగలు ఎవరూలేని సమయంలో తాళం వేసిన ఇంట్లోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. బొల్లెమోని అంజి అలియాస్ స్వామి, జల్గరి ముత్తు, జలగరి బాబు గతంలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 20 నుంచి 25 దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉండి పలుమార్లు జైలుకు వెళ్లొచ్చారు. 2025 జూలైలో జలగరి బాబు అత్తగారి ఊరైన వనపట్లలో పట్టపగలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళం పగలగొట్టి బంగారు ఆభరణాలు దొంగిలించారు. దీంతోపాటు ముగ్గురు బైకుపై గ్రామాలు తిరుగుతూ.. తిమ్మాజిపేట మండలంలోని గొరిటలో రైతు జిల్లెల ధర్మారెడ్డి ఇంటి తాళాలు పగలగొట్టి 2025 అక్టోబర్ 27న పట్టపగలు చొరబడి బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఇలా దొంగిలించిన డబ్బులు ముగ్గురు పంచుకునేవారు. 2026 మే 30న నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంతబజారులో బంగారు నగలు విక్రయించేందుకు వచ్చిన బాబు, ముత్తు ను పోలీసులు పట్టుకుని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తిమ్మాజి పేట పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్ 157/2025 కేసులో పోయిన 14.5 తులాల బంగారంలో 13 తు లాలు రికవరీ చేయగా.. నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 238/2025 కేసులో 6 తులాల బంగారం, 20 తులాల వెండిని పూర్తిగా రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లకు సీసీ కెమోరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కేసును ఛేదించిన సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐలు గోవర్ధన్, రమేష్, శ్రీనివాస్‌రావు, సిబ్బంది వెంకటేష్, భీముడు, రమేష్ ను ఎస్పీ అభినందించారు.


