మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ రెండో కౌన్సిల్ సమావేశం బుధవారం వాడీవేడిగా సాగింది. ఎజెండాలోని అంశాలను అధికారులు చదివి వినిపిస్తుండగా కౌన్సిల్ సభ్యులు ప్రజాసమస్యలు, ఇబ్బందులపై మొదట చర్చించాలని, ఎజెండాలోని అంశాలు అందరికీ తెలుసని కోరడంతో మొదట ప్రజాసమస్యలపై చర్చ జరిగింది. గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదని, ఇప్పటికే ఎజెండాలో కొత్త బిల్లులు పెట్టారని ప్రశ్నించారు. ఏఓ మున్సిపాలిటీ నుంచి వేతనాలు తీసుకుంటూ హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కమిషనర్ స్పందిస్తూ సాధారణ బడ్జెట్ నుంచి గతంలో పనులకు బిల్లులు చెల్లిస్తూ కొత్త పనులు కూడా చేపడుతామని, ఇక్కడ వేతనం తీసుకుంటూ హైదరాబాద్‌లో పనిచేసే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి, కమిషనర్ రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● మున్సిపాలిటీ ఆవరణలో రూ.17 లక్షలతో మెడికల్ షెడ్ నిర్మాణం అవసరమా, ఆ నిధులను కళాభారతికి ఇవ్వాలని ప్రశ్నించగా కార్పొరేషన్ పరిధిలోని మహిళా సంఘాల సభ్యుల కోసం దీన్ని నిర్మిస్తున్నామని, నిధులు ముడా నుంచి వస్తున్నాయని, కళాభారతికి రూ.3.20 కోట్లను ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. 81 పాయింట్ల ఎజెండాతో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారని, మూడు నెలల తర్వాత ఎందుకని.. నెలకోసారి సమావేశం నిర్వహించాలని కోరారు.
● కార్పొరేషన్ విస్తరిస్తున్న క్రమంలో ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డులో ఓ ఏజెన్సీ ద్వారా సర్వే చేయిస్తే దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉన్నట్లు తెలిపిందని, దీనివల్ల డంపింగ్ యార్డు చుట్ట పక్కల సుమారు 6, 8 వార్డులకు ఇబ్బందికర పరిస్థితి ఉందని డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. దీన్ని అధిగమించేందుకు ఏకలవ్య కాలనీలో 45 ఎకరాల భూమిని కార్పొరేషన్ డంపింగ్ యార్డుకు కేటాయించుకునేలా సభ్యులు సహరించాలని కోరారు. దేశంలో జీరో చెత్త విధానం ఒక్క పుణె మున్సిపాలిటీలో ఉందని, అక్కడ వచ్చిన ప్రతి చెత్తను ప్రాసెస్ చేసి జీరో చెత్త చేస్తున్నారన్నారు. దీనిపై అధ్యయనానికి కమిషనర్ ఆధ్వర్యంలో 60 డివిజన్ల కార్పొరేటర్‌లు త్వరలో పుణెకు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని కోరారు.
దుకాణాల వేలంపై ప్రధాన చర్చ..
కార్పొరేషన్ పరిధిలోని పలు దుకాణాలకు గతంలో ఉన్న అద్దె బకాయిలను చెల్లించకుండా వాటికి కొత్తగా వేలం వేయడం ద్వారా భారీగా నష్టం వాటిల్లుతుందని బీజేపీ కార్పొరేటర్‌లు ప్రశ్నించారు. కార్పొరేషన్‌కు సుమారు రూ.70 కోట్లపైగా నష్టాల్లో ఉంటే ఇలా అద్దె వసూలు చేయకుండా వేలం వేస్తే బకాయిలు ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. కేవలం వ్యాపారాలు లేకుండా ఖాళీగా ఉన్న దుకాణాలకు మాత్రమే వేలం వేయాలని, వ్యాపా రాలు కొనసాగుతున్న వాటికి వేయవద్దని కోరారు. భగీరథకాలనీలో ప్రభుత్వ స్థలంలో బోర్డులు ఏర్పాటు చేస్తే తొలగిస్తున్నారని, సుభాష్‌నగర్ ప్రాంతంలో కుక్కులు ఎక్కువగా ఉన్నాయని, వాటి కట్టడికి చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. విలీన గ్రామాలైన చిన్నదర్పల్లిలో తమకు తెలియకుండానే పనులు జరుగుతున్నాయని, ఇంటినంబర్లు లేని పాత ఇళ్లకు నంబర్లు కేటాయించాలని కోరారు. రాత్రి సమయాల్లో ఫంక్షన్‌హాల్స్, హోటల్స్ తమ చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని, ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తున్నారని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇళ్లలోకి వర్షం నీరురావడం, తాగునీరు, డ్రెయినేజీ, దోమలు, రోడ్లు తదితర సమస్యలపై సభ్యులు ప్రశ్నించారు.
ఇప్పుడు వేలం వేస్తే.. పాత అద్దె రూ.70 కోట్లు ఎవరిస్తారు..?
వివిధ సమస్యలపై నిలదీసిన కార్పొరేటర్లు
వాడీవేడిగా కౌన్సిల్ సమావేశం


