జైలు చరిత్రలో రెండో ఘటన
24గంటలపాటు సాగిన హైడ్రామా
● ఖైదీని జైలుకు తీసుకెళ్లడంతో
కథ సుఖాంతం
● నిర్లక్ష్యంగా ఉన్న
ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెండ్
మహబూబ్‌నగర్ క్రైం: పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉంటూ జిల్లా జైలు నుంచి పరారైన కిషోర్‌కుమార్‌రెడ్డిని వన్‌టౌన్ పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో మధ్యాహ్నం తర్వాత కిషోర్‌కుమార్‌రెడ్డిని వన్‌టౌన్ పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. వనపర్తి ఆస్పత్రి నుంచి రాత్రి మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి రాగా.. చికిత్స అందించారు. ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు నిర్ధారించిన తర్వాత పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెండ్
పోక్సో కేసులో ఉన్న రిమాండ్ ఖైదీ కిషోర్‌కుమార్‌రెడ్డి జైలునుంచి పరారీ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను జైళ్లశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జరిగిన ఘటనపై జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్ సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత ఇద్దరు కానిస్టేబుళ్ల విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేల్చారు. దీంతో ఆ సమయంలో అప్రమత్తంగా లేని కారణంగా సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
అసలా గంట ఏం జరిగింది?
జిల్లా జైలులో 24గంటలపాటు హైడ్రామా సాగింది. ఒక ఖైదీ జైలు నుంచి పరారయ్యాడనే విషయం బయటకు పొక్కడంతో భద్రతా లోపంపై అధికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో జైళ్ల శాఖ ఉన్నతాధికారులు సీరియస్ తీసుకొని విచారణ కోసం డీఐజీని పంపించారు. డీఐజీ వచ్చిన తర్వాత 24గంటలపాటు జైలులో పూర్తిగా హడావుడి సాగింది. ఖైదీలకు ప్రత్యేక ఆంక్షలు విధించి.. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక జాగ్రత్తలు పాటించారు. సాధారణంగా ప్రతి సోమవారం ఉదయం 8గంటలకు ఖైదీలకు టిఫెన్ చపాతీ పెడుతారు. ఈ క్రమంలోనే జైలులో ఉన్న దాదాపు 200మంది ఖైదీలకు చపాతీలు తయారు చేయడానికి సోమవారం తెల్లవారుజామున 4:30ప్రాంతంలో 8మంది ఖైదీలను కిచెన్‌లోకి అనుమతిచ్చారు. దీంతో చపాతీలు చేయడానికి వచ్చిన 8మంది ఖైదీలు అందరూ కిచెన్‌లో వారి పనుల్లో నిమగ్నం కాగా.. డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు కొంత ఏమరపాటు ఉన్న సమయంలో కిషోర్ కుమార్‌రెడ్డి కిచెన్‌లో నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత టవల్స్ సహాయంతో వెనుకవైపున్న గోడదూకి బయటకు వెళ్లిపోయాడు.
జిల్లా జైలు చరిత్రలో ఖైదీలు తప్పించుకొని పోవడం ఇది రెండో ఘటన. గతంలో 2018లో దొంగతనం కేసులో జైలుకు వచ్చిన చాపల భాస్కర్ అనే ఖైదీని వైద్య పరీక్షల కోసం ఏఆర్ పోలీసులు ఎస్కాట్‌తో జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి నుంచి ఏఆర్ పోలీసులను దృష్టి మళ్లీంచి ఖైదీ పరారయ్యాడు. మళ్లీ పోక్సో కేసులో జైలు నుంచి ఖైదీ తప్పించుకొని పోవడం స్థానికంగా కలకలం రేపింది.


