ప్రీ ప్రైమరీ టీచర్‌ పోస్టులకు పైరవీలు | - | Sakshi
Sakshi News home page

ప్రీ ప్రైమరీ టీచర్‌ పోస్టులకు పైరవీలు

Jul 8 2026 1:08 AM | Updated on Jul 8 2026 1:08 AM

అధికారులపై ఒత్తిడి చేస్తున్న నాయకులు

ప్రకటించిన మెరిట్‌ లిస్టును తొలగించిన హెచ్‌ఎంలు

ఒత్తిడి తట్టుకోలేక మహబూబ్‌నగర్‌ రూరల్‌ ఎంఈఓ రిజైన్‌

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీపైమరీ బడులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఉపాధ్యాయులు, ఆయాల నియామకం కోసం చర్యలు చేపట్టింది. దీంతో అధికారులపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయడం సర్వసాధారణంగా మారింది. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌ రూరల్‌ ఎంఈఓపై కూడా ఒత్తిడి తీసుకురావడంతో ఆయన తనను ఎంఈఓ పోస్టు నుంచి తప్పించాలని, తాను పనిచేయలేనని కోరుతూ డీఈఓ కార్యాలయంలో రిజైన్‌ లెటర్‌ పెట్టడం విద్యాశాఖ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలోని చౌదర్‌పల్లి, బొక్కలోనిపల్లి, కోటకదిర, మాచన్‌పల్లి, ఫతేపూర్‌, ఇప్పలపల్లి, గాజులపేట గ్రామాలు ఉన్నాయి. అయితే పది రోజుల క్రితం అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో మహబూబ్‌నగర్‌ రూరల్‌, అర్బన్‌ మండలాల మెరిట్‌ లిస్టు కలెక్టరేట్‌ నుంచి రావడంతో ఆయా, టీచర్‌ పోస్టుల్లో ఎంపికై న అభ్యర్థుల మెరిట్‌ లిస్టును పాఠశాల నోటీస్‌ బోర్డులో పెట్టడంతోపాటు ఫోన్‌లో కూడా ఫార్వర్డ్‌ చేశారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల అభ్యర్థులు ఆయా పోస్టులలో సైతం చేరారు. అయితే మంగళవారం సదరు అభ్యర్థులు వెళ్లిపోవాలని, మరోసారి మెరిట్‌ లిస్టు వస్తుందని పాఠశాల హెచ్‌ఎంలు సూచించడంతో వారంతా అవాక్కయ్యారు.

తాము సూచించిన పేరు పెట్టాలని..

మెరిట్‌ లిస్టులో తాము సూచించిన పేర్లు పెట్టాలని మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలానికి చెందిన కొందరు నాయకులు అధికారులపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తుంది. నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడి పీఏ సైతం అధికారులకు ఫోన్‌ చేసి గతంలో ఇచ్చిన లిస్టును తొలగించాలని, మరో లిస్టు తయారు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో అధికారులు హెచ్‌ఎంల ద్వారా ఇప్పటికే ఎంపికై న అభ్యర్థులను తిప్పి పంపినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మొదట వచ్చిన మెరిట్‌ జాబితా కలెక్టర్‌ అనుమతితో జిల్లా విద్యాశాఖ అధికారులు పంపించారు. ఇలాగే అర్బన్‌ ఎంఈఓ కార్యాలయంలో కూడా పలువురు ప్రజాప్రతినిధులు సూచించిన పేర్లను తాజాగా లిస్టులో చేర్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై డీఈఓ విజయకుమారిని వివరణ కోరగా ఏవైనా అభ్యంతరాలు ఉంటే మాత్రమే చెప్పుకొనేందుకు అవకాశం ఉంది. కానీ, మెరిట్‌ లిస్టులో మార్పులు చేసేందుకు అవకాశం లేదని చెప్పారు. ఎంఈఓ కృష్ణయ్యను వివరణ కోరగా తాను డీఈఓ కార్యాలయంలో తన ఎంఈఓ పోస్టుకు రిజైన్‌ లెటర్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement