నిరుపయోగంగా పత్తి మార్కెట్ యార్డు
● శిథిలావస్థకు చేరిన దుకాణ సముదాయం
జడ్చర్ల: ఒకప్పుడు అన్ని సౌకర్యాలతో కళకళలాడిన జడ్చర్ల పత్తి వ్యవసాయ మార్కెట్‌యార్డు ప్రస్తుతం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. పూర్వ వైభవం కోల్పోయి వెలవెలబోతోంది. సువిశాల స్థలంలో నిర్మించినా నిరుపయోగంగా మారింది.
అన్ని హంగులతో నిర్మాణం
జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డును టీఎంసీ(టెక్నాలజీ మిషన్ ఆన్ కాటన్) ముంబాయి వారి సౌజన్యంతో దాదాపు రూ.3.38 కోట్ల వ్యయంతో 2008లో నిర్మించారు. ఇందులో టీఎంసీ రూ.50 లక్షల సాయం చేసింది. 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న రెండు గోదాములను నిర్మించారు. వీటికి అనుబంధంగా 500 మెట్రిక్ టన్నుల మరో రెండు గోదాములు ఏర్పాటు చేశారు.
2008లో ప్రారంభం
అన్ని హంగులతో నిర్మించిన పత్తి మార్కెట్‌ను అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 09 ఏప్రిల్ 2008న ప్రారంభించారు. అదేవిధంగా పత్తి మార్కెట్‌కు స్థలాన్ని ఉచితంగా ఇచ్చిన విజయ్‌కుమార్ తల్లిదండ్రుల విగ్రహాలను వైఎస్‌ఆర్ ఆవిష్కరించారు. ప్రస్తుతం పత్తి మార్కెట్ యార్డును కేవలం ప్రభుత్వం కొనుగోలు చేసే కేంద్రాలను ఏర్పాటు చేసేందుకే పరిమితం చేశారు.
పత్తి మార్కెట్ యార్డులో ఎక్కడి సమస్యలు అక్కడ పేరుకుపోయాయి. తూకాలు వేసే వే బ్రిడ్జి తుప్పు పట్టి కంపచెట్లు కమ్ముకుపోయాయి. మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. నీటి ఎద్దడి సమస్య తీవ్రంగా ఉంది. కమీషన్ ఏజెంట్ల 60 దుకాణాల సముదాయం సైతం మూతపడి షట్టర్లు తుప్పుపట్టాయి. యార్డు ప్రహరీ కూలిపోయింది.
ఏజెంట్ల అడ్డంకి
అయితే గంజి నుంచి పత్తి మార్కెట్‌కు యార్డును తరలించడానికి కమీషన్ ఏజెంట్లు ససేమిరా అంటున్నారు. గతంలో ఓ సారి పత్తి మార్కెట్‌కు తరలించేందుకు పాలకమండలి నిర్ణయించినా కమీషన్ ఏజెంట్ల వ్యతిరేకతతో వెనక్కి తగ్గారు. కమీషన్ ఏజెంట్లు దశాబ్దాలుగా మార్కెట్ సమీపంలో నివాసాలను నిర్మించుకొని కుటుంబాలతో ఉంటున్నా రు. ఇళ్లకు దగ్గరగా ఉండాలని పట్టుబడుతున్నారు.
తుప్పపట్టిన దుకాణ సముదాయంలో ఒక భాగం


