అలంపూర్: వర్షాకాలంలో పంటల సాగులో రైతులు నిమగ్న మయ్యారు. అధికారులు రైతులు అవగాహన కల్పిస్తున్నారు. మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మొక్క పెరుగుదలలో నత్రజని, భాస్వరం, పొటాషియంలు కీలకమని పేర్కొంటున్నారు. పంటల పెరుగుదలలో భాస్వరం, పొటాషియం పాత్ర ప్రాముఖ్యతను మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున రెడ్డి రైతులకు వివరించారు.
భాస్వరం
ఈ పోషకాన్ని మొక్కలు భాస్వరికామ్ల లవణాల రూపంలో తీసుకుంటుంది. భాస్వరానికి నేలలో కొట్టుకపోయే స్వభావం లేదు. అయితే కొంత భాగం నేలలో బిగుసుకుపోతుంది. మట్టి రేణువులకు అంటిపెట్టుకొని తర్వాత పైరుకు కూడా ఉపయోగపడుతుంది. పైరుకు ప్రథమ దశలో భాస్వరం ఆవశ్యకత అధికం కావున పూర్తి మోతాదు మొదటనే పైరు అడుగులో ఒకేసారి వేయాలి. వేసి నేలలో కలిసేటట్టు చేయాలి.
పంటల పెరుగుదలలో..
● పూత, కాత గింజ పట్టడానికి..
● పైరు దుబ్బు చేయుటకు, మొక్క శాఖోపశాఖలుగా పెరుగుటకు..
● సేంద్రియ పదార్ధాలు బాగా చివుటకు
● మొక్కలలో మాంసకృత్తులు, ఎంజైముల తయారీకి భాస్వరం, నత్రజని తగినంత మోతాదులో ఉన్నప్పుడు రెండింటిని మొక్క అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో ఒకదానికి ఒకటి తోడ్పడతాయి.
భాస్వరం లోపిస్తే.....!
● మొక్క పెరుగుదల, పిలకలు పెట్టె శక్తి తగ్గుతుంది.
● వేళ్లు బలహీనంగా మారుతాయి.
● ఆకులు ముదురు ఆకు పచ్చ నీటి రంగు కలిసినట్లుగా ఉంటాయి.
● పూత రావడం, పైరు పక్వానికి రావడం ఆలస్యం అవుతుంది.
● పండ్లు, గింజలు, విత్తనాల అభివృద్ధి కావడం తక్కువగా ఉంటుంది.
పొటాషియం.. ప్రాధాన్యం
వాడుకలో దీన్ని పోటాష్ అంటారు. ఈ పోషకాన్ని మొక్క పొటాషియం రూపంలో తీసుకుంటుంది.
● పైరుకు ఆరోగ్యం, ధృడత్వం చేకూరుతుంది.
● మొక్కల్లో జరిగే జీవ రసాయన క్రియలకు ఆకుల్లో తయారైన పిండి పదార్థం ఇతర భాగాలకు చేకూరేందుకు పైరుకు రోగ నిరోధక శక్తిని కలిగించి పురుగులకు, తెగుళ్లకు లొంగనీయదు.
● శాఖీయ భాగాలను కాండాన్ని బలపరిచి నేలపై వాలనీయదు.
● గింజ కట్టు పూర్తిగా ఉండి నాణ్యత పెరుగుతుంది.
● ప్రత్యేకించి పండ్లు కూరగాయలు మొదలగు పంటల్లో నాణ్యత పెరగడానికి దోహదపడుతుంది.
● చలి వాతావరణం లాంటి ప్రతి కూల పరిస్థితులను తట్టుకోవడానికి ఉపయోగపడుతోంది.
పొటాషియం లోపిస్తే
● ముదురు ఆకుల అంచులు ఆకు పచ్చని రంగు నుంచి పసుపు రంగులోకి మారిపోవడం
● ఆకు కొనలు గోధుమ రంగులోకి మారి దిగువ భాగానికి విస్తరించడం జరుగుతుంది.
● పెరుగుదల నెమ్మదిగా ఉండి మొక్క గిడసబారుతుంది.
● కాండం బలంగా లేక సులభంగా వాలిపోతుంది.
● పండ్లు కూరగాయాల్లో రంగు, రుచి, వాసన, రవాణాలో నిల్వ ఉండే గుణం తగ్గుతుంది.
పాడి–పంట


