● మోపెడ్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
● ఒకరికి గాయాలు, శాఖాపూర్
టోల్‌ప్లాజా వద్ద ఘటన
అడ్డాకుల: 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందగా.. మరొకరు గాయపడిన ఘనట సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మురళి కథనం ప్రకారం.. కాటవరం గ్రామానికి చెందిన ఎరుకలి బాబు(35) మంజుల దంపతులు. కుటుంబ పోషణకు దంపతులిద్దరు టోల్‌ప్లాజా వద్ద బాబు టీ కొట్టు నడిపిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తన ఎక్సెల్‌పై కర్ణాటకకు చెందిన విశాల్‌తో కలిసి టీకొట్టు నుంచి ఇంటికి వెళ్లడానికి బయలు దేరాడు. తిరిగి యూటర్న్ వద్ద టీకొట్టు వైపు వెళ్తుండగా వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు హైదరాబాద్ వైపు వెళ్తూ ముందున్న ఎక్సెల్‌ను ఢీకొట్టింది. దీంతో ఎరుకలి బాబు తల పగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విశాల్‌కు గాయాలు కావడంతో ఎల్‌అండ్‌టీ అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. అతడు బెంగళూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే ఓ ట్రావెల్స్ బస్సుకు చెందిన వాడుగా తెలిసింది. కాగా, టీకొట్టు నుంచి వచ్చిన మృతుడి భార్య మంజుల రోధనలు ఘటనా స్థలంలో అందరినీ కలచి వేశాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ మురళి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రెక్కాడితే డొక్కాడని కుటుంబం
ఎరుకలి బాబు కుటుంబం కడు పేదరికంలో ఉంది. జీవనోపాధికి రోడ్డు పక్కన చిన్న టీకొట్టు పెట్టుకున్నాడు. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు పిల్లలను మూసాపేట ప్రభుత్వ హాస్టల్‌లో చేర్పించాడు. చిన్న కుమార్తె కాటవరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. కుటుంబ యాజమాని మృతితో ఆ కుటుంబం వీధినపడింది. ముగ్గురు చిన్నపిల్లలతో భార్య మంజుల టీకొట్టుతో జీవనం సాగించడం కష్టసాధ్యం కానుంది. భర్త మృతదేహం వద్ద ఆమె రోధనలు కంటతడి పెట్టించాయి. దాతలు సాయం చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.


