మహబూబ్‌నగర్ క్రైం: జోనల్ డ్యూటీ మీట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాల ఖ్యాతిని మరింత పెంచాలని మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆమె ఉమ్మడి పాలమూరులోని జిల్లాల జోనల్ పోలీస్ డ్యూటీ మీట్–2026–27ను ప్రారంభించారు. ఈ జోనల్ మీట్‌లో జోగుళాంబ జోన్–7 పరిధిలోని ఐదు జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పలు విభాగాల్లో పోటీలు నిర్వహించగా ప్రధానంగా సైంటిఫిక్ విచారణ పద్ధతి, కంప్యూటర్ పరిజ్ఞానం, డాగ్‌స్క్వాడ్, ఫొటో, వీడియోగ్రఫీలలో పోటీలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జోనల్ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్రస్థాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్‌కు అర్హత సాధించి అక్కడ కూడా అత్యుత్తమ ప్రతిభ చాటాలన్నారు. ఇలాంటి పోటీలు పోలీస్ సిబ్బందిలో వృత్తి నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, దర్యాప్తు సామర్థ్యాలు మరింత మెరుగుపడుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రత్నం, సురేష్‌కుమార్, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్, అశోక్‌కుమార్, భూత్పూర్ సీఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


