జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని జిల్లా సహకార అధికారి కృష్ణ అన్నారు. సోమవారం పాలమూరు కోపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో సహకార వారోత్సవాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాభాల బాటలో ఉన్న పాలమూరు అర్బన్ బ్యాంక్ త్వరలోనే మల్టీస్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌గా ఆవిష్కరణ కావాలని ఆకాంక్షించారు. అనంతరం బ్యాంక్ చైర్మన్ కండె కుమారస్వామి మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో 1998లో ఏర్పడిన ఈ బ్యాంక్ 28 సంవత్సరాల్లోనే గణనీయమైన లాభాలు ఆర్జించిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రూ.1.29 కోట్ల నికర లాభంతోపాటు రూ.55 కోట్ల రుణాలను సభ్యులకు ఇచ్చామని చెప్పారు. అంతేకాకుండా దాదాపు రూ.60 కోట్ల డిపాజిట్లు సంఘం సభ్యులతో సేకరించి.. దాదాపు రూ.3.5 కోట్లకుపైగా వాటాలు కలిగి సంఘం సభ్యులకు 25 శాతం డివిడెంట్ ఇచ్చామని చెప్పారు. రాబోయే కాలంలో ఉమ్మడి పాలమూరులోని గద్వాల, వనపర్తి, నారాయణపేటలో బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఆడిట్ అధికారి టైటస్‌పాల్, బ్యాంక్ సీఈఓ రాజేంద్రకుమార్, సహకార శాఖ ఉద్యోగులు కల్పన, దివ్య, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


