దుందుభీ వాగుపై వంతెనల నిర్మాణానికి చర్యలు
నిధులు మంజూరు..
ఎన్నో ఏళ్ల కల..
మరింత అభివృద్ధి..
వాగు అవతలి వైపే..
జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గంలో పారుతున్న దుందుభీ వాగుపై బ్రిడ్జి(వంతెన)ల నిర్మాణంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతోపాటు వరద పారుతున్న సమయంలో ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట పడనుంది. ఈ మేరకు మిడ్జిల్‌లో జరిగిన కృతజ్ఞత సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన వరాలతో అటు మిడ్జిల్.. ఇటు జడ్చర్ల మండలాల పరిధిలోని పలు గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో ఆయా గ్రామాల దశ మారనుంది. నియోజకవర్గంలోని బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్ మండలాల గుండా పారుతున్న దుందుబీ వాగు కారణంగా పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతాయి. దీంతో కొన్నిరోజులపాటు ఆయా గ్రామాల ప్రజలు అక్కడే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. దీనికితోడు వ్యవసాయ భూములు వాగుకు అటు ఇటుగా ఉండడంతో వర్షాల సమయంలో ప్రాణాలు అరచేత పట్టుకుని పొలాలకు వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఎంతోమంది వాగు దాటుతూ ప్రాణాలు కోల్పోయారు.
రవాణా సౌకర్యం మెరుగు..
దుందుభీ వాగుపై బ్రిడ్జిల నిర్మాణంతో ఆయా గ్రామాలకు మహర్దశ పట్టనుంది. జడ్చర్ల మండలంలోని దుందుభీ పరివాహక ప్రాంతంలో ఉన్న నెక్కొండ, అమ్మపల్లి గ్రామాల పరిస్థితి ఇదే. ఈ గ్రామాలకు ఒక వైపు మాత్రమే రాకపోకలు కొనసాగించాల్సి ఉండటంతో.. ప్రజలు గంగాపూర్ ద్వారానే రావాల్సి వస్తుంది. ఒకవేళ దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మిస్తే రెండోవైపు మిడ్జిల్ మండలంలోని కంచనపల్లి, దోనూరు గ్రామాల ద్వారా వెళ్లే ఆస్కారం ఉంటుంది. ఇక ఎక్వాయిపల్లి నుంచి లింగందన వెళ్లే మార్గంలో కూడా దుందుభీ వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణంతో అంతారం, వెల్జాల గ్రామాల వైపు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. అలాగే లింగంపేట– నల్లకుంటతండా మధ్య వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోవడం ప్రతిఏటా జరుగుతుంది. మిడ్జిల్ మండలంలోని వల్లభ్‌రావుపల్లి– వేముల మధ్య బ్రిడ్జి నిర్మాణంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు ఏర్పడనున్నాయి. దుందుభీ వాగుపై బ్రిడ్జిల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడి వ్యవసాయ భూములకూ డిమాండ్ పెరుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు భావిస్తున్నారు.
నెక్కొండ, అమ్మపల్లి గ్రామాలకు ఒకవైపు మాత్రమే రాకపోకలు సాగించే పరిస్థితి ఉంది. దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నా ఫలితం లేకపోయింది. ఇన్నాళ్లకు తమ కల సాకారం కానుంది. బ్రిడ్జి నిర్మాణం చేపడితే మిడ్జిల్ మండలం వైపు ఉన్న గ్రామాల ద్వారా అనేక ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు కలుగుతాయి.
– కృష్ణయ్య, సర్పంచ్, నెక్కొండ
ఎక్వాయిపల్లి– లింగందన గ్రామాల మధ్య దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మించడం వల్ల మరోవైపు రాకపోకలు ఏర్పడనున్నాయి. దీంతో మా గ్రామం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. దుందుభీ వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో అనేక ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నాళ్లకు తమ కల నెరవేరే అవకాశం కలిగింది.
– మమత, సర్పంచ్, ఎక్వాయపల్లి
నెరవేరనున్న ఆయా గ్రామాల
చిరకాల స్వప్నం
వాహన రాకపోకలతో తప్పనున్న
ప్రమాదాలు
వ్యవసాయ భూములకు పెరగనున్న డిమాండ్
సీఎం ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
దుందుభీ వాగుపై బ్రిడ్జిల నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నెక్కొండ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.4.50 కోట్లు, లింగంపేట– నల్లకుంటతండా మధ్య బ్రిడ్జికి రూ.4.50 కోట్లు, ఎక్వాయిపల్లి– లింగందన మధ్య వంతెన పనులకు రూ.3 కోట్లు, వల్లభ్‌రావుపల్లి– వేముల మధ్య బ్రిడ్జికి రూ.10.50 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వెల్లడించారు. ఎట్టకేలకు దుందుభీ వాగుపై వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్వాయిపల్లి గ్రామానికి సంబంధించి 60 శాతం వ్యవసాయ భూములు దుందుభీ వాగు అవతలి వైపే ఉన్నాయి. దుందుభీ ప్రవాహంలో మనుషులు, పశువులు కొట్టుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. వర్షాకాలంలో పంట పొలాలకు రాకపోకలు నిలిచిపోతాయి. బ్రిడ్జి నిర్మాణంతో ఆ బాధలన్నీ తీరిపోతాయి. అలాగే మా భూములకు మంచి డిమాండ్ కూడా వస్తుంది. – బాల్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు, ఎక్వాయిపల్లి


