మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలోని ఆర్టీసీ కొత్త బస్టాండులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నల్లవెల్లి కురుమూర్తి డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో బస్టాండు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి.. డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ కింద సెల్లార్ తాగుబోతులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. పరిసర ప్రాంతాలన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయని, దుర్గంధంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా ఎవరూ పట్టించుకోడం లేదని విమర్శించారు. ముఖ్యంగా ఆటోవాలాలు గేట్ల (ఇన్, అవుట్‌తోపాటు ప్రయాణికులు లోపలికి వెళ్లే మార్గం)లో అడ్డదిడ్డంగా ఆపుతూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారన్నారు. బస్టాండ్ ఆవరణ మొత్తం గుంతలమయంగా మారిందని, శిథిలావస్థలో ఉన్న మూత్రశాలలను కూల్చివేయాలన్నారు. క్యాంటీన్ నుంచి బయటకు వచ్చే మురుగు కాల్వలో సాఫీగా ముందుకు వెళ్లే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. వారం రోజుల్లో ఆయా సమస్యలను పరిష్కరించకుంటే ఆర్‌ఎం కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కంట్రోలర్ ఆంజనేయులుకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజ్‌కుమార్, కమర్‌అలీ, గాలన్న, భాస్కర్, రవి, కృష్ణ, ఎల్లప్ప, ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు.


