ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
మహబూబ్‌నగర్ రూరల్: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో విజయాలను సాధించాలని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని శిశుగృహ హాల్‌లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఆయా రంగాల్లో దివ్యాంగులు ప్రదర్శిస్తున్న ప్రతిభా పాటవాలను గుర్తు చేస్తూ వారిని కొనియాడారు. విద్య, రాజకీయ రంగాలతో పాటు క్రీడలు, ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా ఏ రంగంలో చూసినా దివ్యాంగులు సమాజంలోని ఇతరులకు ఏమాత్రం తీసిపోకుండా తమ ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ఉద్దేశించిన భవిత కేంద్రాలను జిల్లాలో అన్ని వసతులతో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. జిల్లాలోని దివ్యాంగుల సమస్యలను చాలా వరకు పరిష్కరించామని, ఇంకా మిగిలిన వాటిని కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు. అనంతరం దివ్యాంగుల క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, డీడబ్ల్యూఓ జరీనాబేగం,అంధుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ రాములు పాల్గొన్నారు.


