వణుకుతున్న వసతి గృహాలు
కేజీబీవీలు, గురుకులాల్లో భిన్న పరిస్థితులు..
జిల్లాలో 15 కేజీబీవీలు ఉండగా ఇందులో 4,600 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో పాఠశాల స్థాయిలో చదువుతున్న వారికి మాత్రమే వేడినీళ్లు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొన్నింటిని ప్రభుత్వం ఇంటర్మీడియట్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసింది. అయితే ఇంటర్ విద్యార్థులకు సోలార్ వాటర్ హీటర్లు కానీ, గీజర్లు కానీ ప్రభుత్వం అందజేయకపోవడంతో చల్లని నీటితోనే స్నానాలు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు మొత్తం 32 ఉండగా వీటిలో వీటిలో 9 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో కొన్నింటిలో గీజర్లు మరమ్మతులకు గురి కావడంతో అందరికీ వేడి నీళ్లు అందడం లేదు.
● గండేడ్ మండల పరిధిలోని వెన్నాచేడ్‌లో ఎస్సీ వసతి గృహంలో 146 మంది విద్యార్థులు ఉన్నారు. సరిపడే బాత్‌రూంలు లేకపోవడంతో ఆరుబయటే చల్లని నీటితో స్నానాలు చేస్తున్నారు. మహమ్మదాబాద్‌లోని ఎస్టీ బాలుర వసతి గృహంలో చలికి విద్యార్థులు ఆలస్యంగా నిద్రలేచ్చారు. పెద్ద తరగతి విద్యార్థులు పాత దుప్పట్లతోనే సర్దుకున్నారు. చిన్నచింతకుంటలోని ఎస్పీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి.
వేడినీళ్లు ఇవ్వడం కలే..
జడ్చర్లలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లోని విద్యార్థులు చన్నీళ్లతోనే స్నానాలు చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో తెల్లవారుజామున 5.30 గంటల నుంచి బోరు వేశాక వచ్చే ఆ కాస్త ప్రకృతి సిద్ధమైన వేడినీటితో చలిలో స్నానం చేస్తున్నారు. గతంలో వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్దకు వెళ్లి స్నానాలు చేసేవాళ్లమని విద్యార్థులు తెలిపారు. చన్నీళ్లతో స్నానం చేయడం అలవాటుగా మారిపోయిందని చెబుతున్నారు. మూడో తరగతి విద్యార్థులు సైతం చన్నీటితోనే స్నానాలు చేయాలి. ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో మిషన్‌భగీరథ నీటిని ట్యాంక్‌లో నింపాక దాని నుంచి వచ్చే నీటితో స్నానం చేస్తున్నారు. ఇదే హాస్టల్‌లో కిటికి అద్దాలు పగిలిపోగా వాటిస్థానంలో థర్మకోల్, బెడ్‌షీట్లు అడ్డుగా పెట్టారు. ఇటీవల కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపి బెడ్‌షీట్లు పంపడంతో ఇబ్బంది తీరిందని విద్యార్థులు చెబుతున్నారు.
వణుకుతున్న వసతి గృహాలు
వణుకుతున్న వసతి గృహాలు
వణుకుతున్న వసతి గృహాలు


