ప్రజలు అందించిన గొప్ప విజయం
● డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
● సర్పంచ్‌లకు ఘనంగా సన్మానం
స్టేషన్ మహబూబ్‌నగర్: సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గొప్ప విజయం అందించారని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో నూతనంగా గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్‌లకు అభినందన సన్మానసభ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించడంతో అధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పట్ల నమ్మకంతో ప్రజలు గెలిపించినట్లు తెలిపారు. ఇంత ప్రజాస్వామికంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదన్నారు.
ఐక్యతకు నిదర్శనమే ఎన్నికల్లో ఘన విజయం
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాబలం, కార్యకర్తల ఐక్యత, నాయకత్వ సమన్వయానికి నిదర్శనమే సర్పంచ్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయ మని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మ హబూబ్‌నగర్, హన్వాడ మండలాల్లోని 60 సర్పంచ్ స్థానాలకు 40స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించడం చూస్తే.. ప్రజలు మా వెంటే ఉన్నారని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారన్నారు. అయితే కొన్ని పొరపాట్లు కూడా జరిగాయని, నేను ఒక ప్రొఫార్మా ఇచ్చి గ్రామాల్లోకి వెళ్లి ఒక్కో ఇంటికి వెళ్లి ఏ పథకం వచ్చిందని గుర్తించమని చెబితే నూటికి 90 శాతం మంది పనిచేయలేదన్నారు. కొంతమంది నాయకులు గివన్ని చేస్తామా అని చెప్పారని.. వారు ఎవరో తనకు తెలుసని, భవిష్యత్తులో వారు పోస్టుల కోసం వచ్చినప్పుడూ ఈ విషయం చెబుతానని తెలిపారు. ఇప్పటి నుంచి గ్రామాల్లోని కార్యకర్తల మానసిక స్తైర్యాన్ని, వారిని తప్పుదోవ పట్టేలా గ్రూపులు చేస్తే వేటు పడటం ఖాయమని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత, నాయకులు వినోద్‌కుమార్, చంద్రకుమార్‌గౌడ్, జహీర్ అక్తర్, సురేందర్‌రెడ్డి, సీజే బెనహర్, సిరాజ్‌ఖాద్రీ, బి.మధుసూదన్‌రెడ్డి, ఆనంద్‌కుమార్‌గౌడ్, లింగం నాయక్, అజ్మత్‌అలీ, ఫయాజ్, అవేజ్, కృష్ణయ్య, నాగరాజు, మహేందర్, రాంచంద్రయ్య, శ్రీనివాస్‌యాదవ్, మైత్రి యాదయ్య, రియాజుద్దీన్ పాల్గొన్నారు.


