అన్ని పంటలకు కొత్త రుణ పరిమితి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఈసారి యాసంగి సీజన్‌లో పండించే అన్ని రకాల పంటలకు రుణ పరిమితి (కొత్త స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం డీసీసీబీ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారి బి.వెంకటేశ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ (డీఎల్‌టీసీ) సమావేశంలో తీర్మానించారు. ఇందులో భాగంగా వరి పంటకు గతంలో ఎకరాకు రూ.44 వేల రుణం ఇవ్వగా ప్రస్తుతం రూ.48 వేలకు పెంచారు. మొక్కజొన్నకు రూ.19వేల నుంచి రూ.23వేలకు, వేరుశెగనకు రూ.30 వేల నుంచి రూ.35 వేలకు, కందులకు రూ.23 వేల నుంచి రూ.28 వేల వరకు పెంచారు. సమావేశంలో ఉద్యానవన, నాబా ర్డు, మత్స్య, పశుసంవర్ధక శాఖ అధికారులు, ఆయా బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.


