
నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలి: పీయూ వీసీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వీసీ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ మేరకు బాలికల హాస్టల్‌లో నిర్మిస్తున్న అదనపు డైనింగ్ హాల్, రీసెర్చ్ ఫెసిలిటీ భవనం, నూతన ఇంజనీరింగ్, లా కళాశాలల భవనాలను ఆయన పరిశీలించారు. భవనాలను సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయాలని, పూర్తి నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని సూచించారు. ఆయన వెంట పలువురు పీయూ అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్నప్పటికీ.. మద్యంపై ఉన్న ధ్యాస ప్రభుత్వానికి విద్యారంగంపై లేదని విమర్శించారు. మద్యం శాఖకు మంత్రి ఉన్నాడు కానీ, ఒక్క విద్యాశాఖకు మంత్రి లేకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో 90 శాతం గురుకులాలు అద్దెభవనాల్లో నడుస్తున్నాయని, పీయూకు రూ.500 కోట్ల నిధులను విడుదల చేయాలని, లా, ఇంజనీరింగ్ కళాశాలలకు అధ్యాపకులను నియమించాలని డిమాండ్ చేశారు. గతంలో నేదురుమల్లి జనార్దన్ ప్రభుత్వాన్ని విద్యార్థులే కూల్చారని, ప్రభుత్వం విద్యార్థులను విస్మరిస్తే భవిష్యత్‌లో అదే జరుగుతుందని హెచ్చరించారు. నాయకులు కురుమూర్తి, లక్ష్మణ్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రశాంత్, భరత్, మోహన్, భరత్ పాల్గొన్నారు.
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఫోరం అధ్యక్షుడు రాజసింహుడు, సంయుక్త కార్యదర్శి జేఎన్ రెడ్డి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్‌ను కోరారు. జిల్లా కేంద్రంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌ను ఆదివారం ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం కమిటీ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒబేదుల్లా కొత్వాల్‌ను తమ ఫోరానికి గౌరవాధ్యక్షుడిగా ఉండాలని కోరగా అందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు జగపతిరావు, నాగభూషణం, విశ్రాంత ఉద్యోగ నాయకులు పాల్గొన్నారు.

నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలి: పీయూ వీసీ

నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలి: పీయూ వీసీ