
ఆశాలకు ఫిక్స్‌డ్ వేతనాలు ప్రకటించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఆశాలకు ఫిక్స్‌డ్ వేతనాలు ప్రకటించాలని ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వం ఆశలకు కనీస వేతనం అమలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. ఫిక్స్‌డ్ వేతనం అమలు చేయకుండా తాత్సారం చేస్తుందని ఆరోపించారు. ఆశాలపై ఏఎన్‌ఎంలు, వైద్యులు, సూపర్‌వైజర్ల వేధింపులు ఆపాలని, ఆశాలను ఏఎన్‌ఎంలుగా పదోన్నతులు కల్పించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని, డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ విజయేందికు అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ‘చలో హైదరాబాద్’ చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి చంద్రకాంత్, జిల్లా అధ్యక్షుడు సత్తయ్య, పట్టణ అధ్యక్షుడు రాజ్‌కుమార్, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాధన, సుగుణ, నాయకులు యాదమ్మ, పద్మ, సావిత్రి, లక్ష్మి, హైమావతి, వెంకటేశ్వరమ్మ, సునీత, సౌజన్య పాల్గొన్నారు.