
పదోన్నతుల కోలాహలం
పకడ్బందీగా చేపడుతున్నాం..
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా
కొనసాగుతున్న ప్రక్రియ
● సోమవారం వెలువడిన
సీనియార్టీ, ఖాళీల జాబితా
● అభ్యంతరాలు సైతం పరిష్కరించిన తర్వాతే తుది జాబితా
● నేటి సాయంత్రం వరకు
ఉపాధ్యాయులకు ఆర్డర్స్
● ఆన్‌లైన్ విధానంతో
సులువుగా మారిన కసరత్తు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతుల కోలాహలం కొనసాగుతుంది. 2024లో కూడా ప్రభుత్వం పదోన్నతులను ఆన్‌లైన్‌లో చేపట్టినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు స్పౌజ్, హెల్త్ వంటి అంశాలపై తప్పుడు సమాచారం ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతో వివాదాలకు తావులేకుండా ప్రక్రియ సజావుగా సాగినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ నెల 21న నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో 92 మంది ఎస్‌ఏలకు జీహెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించారు. తాజాగా ఎస్‌జీటీలకు ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలుగా, ఎస్‌ఏలుగా 306 మందికి పదోన్నతులు కల్పించే ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇప్పటికే మూడు జిల్లాల్లోని పలు పాఠశాలల్లో ఉన్న ఖాళీలు, అర్హులైన ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను అధికారులు అందుబాటులో ఉంచారు. సీనియార్టీ జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు సోమవారం రాత్రికి వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంది. వారు ఎంపిక చేసుకున్న పాఠశాలల వివరాల ఆధారంగా మంగళవారం సాయంత్రం వరకు ఆర్డర్స్ అందించనున్నారు.
పొరపాట్లు సరిచేసి..
సీనియార్టీ జాబితా వెలువడిన వెంటనే అధికారులు ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలను సోమవారం స్వీకరించారు. ఇందులో మహబూబ్‌నగర్‌లో 3, నారాయణపేటలో 10, నాగర్‌కర్నూల్‌లో 5 అభ్యంతరాలు రాగా ఇందులో పుట్టినరోజు, స్పౌజ్, మెడికల్ తదితర చిన్నపాటి పొరపాట్లు ఉండగా వాటిని అధికారులు సరిచేశారు. దీంతో మూడు జిల్లాల్లో దాదాపు ప్రక్రియ ముగిసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంలకు సంబంధించి మహబూబ్‌నగర్‌లో నలుగురు, నారాయణపేటలో ఏడుగురు, నాగర్‌కర్నూల్‌లో ఐదుగురు విధుల్లో చేరలేదని సమాచారం. ఈ పోస్టులకు తదుపరి సీనియార్టీ జాబితాలో ఉన్న వారికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తుంది.
జిల్లా హెచ్‌ఎం ఎస్‌ఏలు
మహబూబ్‌నగర్ 34 119
నాగర్‌కర్నూల్ 37 107
నారాయణపేట 21 80
జిల్లావ్యాప్తంగా పదోన్నతుల ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నాం. సీనియార్టీ జాబితాపై కొన్ని అభ్యంతరాలు వస్తే వాటిని సకాలంలో పరిష్కరించాం. ప్రస్తుతం వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మంగళవారం సాయంత్రంలోగా ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది.
– గోవిందరాజులు, డీఈఓ, నారాయణపేట