
విద్యార్థులకు చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తారు
స్టేషన్ మహబూబ్‌నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు చేయూత ఇస్తే అద్భుతాలు సృస్టిస్తారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 28 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్టుగా శతశాతం వినూత్న కార్యక్రమాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెండురోజుల నుంచి నిర్వహిస్తున్న విద్యార్థుల ప్రేరణ శిక్షణ తరగతులను ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. మొదటి రోజు శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఎమ్మెల్యే ఎదుట విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు అని అన్నారు. రెండురోజుల పాటు సిలబస్ బోధించడమే కాకుండా పెద్దలను గౌరవించడం, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు పదో తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించడమే శత శాతం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని 28 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి వలంటీర్లను నియమించామన్నారు. వలంటీర్లు విద్యార్థులను మానసికంగా, ధృడంగా ఎదిగేందుకు కృషి చేస్తారని అన్నారు. పరీక్షల్లో వచ్చిన మార్కులను పరిశీలించి వెనుకబడిన సబ్జెక్టుల్లో నుంచి ఫలితాలు సాధించే విధంగా విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇస్తారని అన్నారు. శతశాతం కార్యక్రమంతో రాబోయే నాలుగైదేళ్లలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని అన్నారు. కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ సభ్యులు రవీందర్, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, అనిల్, రాజ మల్లేష్ పాల్గొన్నారు.