
రైతు ఆపదలో ఉంటే ప్రభుత్వాల నిర్లిప్తత
మహబూబ్‌నగర్ న్యూటౌన్: దేశానికి అన్నం పెట్టే రైతు ఆపదలో ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లిప్తత చూపుతున్నాయని ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ప్రభాకర్ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆండ్‌బీ అతిథిగృహం వద్ద అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర మహాసభల ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలను తుంగలో తొక్కి అందలం ఎక్కి ఆగం చేస్తున్నారని విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ సిఫారసులను అమలు చేసి వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించే చట్టా న్ని, పంటలకు సాగునీటి వసతి కల్పించే వసతులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈనెల 25, 26 తేదీల్లో జిల్లా కేంద్రంలో నిర్వహించే అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ, ఏఐయూకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాము, పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, నర్సింహ, టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రఫి తదితరులు పాల్గొన్నారు.