
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం ఆమె కలెక్టరేట్‌లోని వీసీ హాల్ నుంచి వర్షాలు, సహాయక చర్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇతర ప్రాధాన్య అంశాలపై ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, ఏపీఎంలు, ఏపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో వెబెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా అధికార, సిబ్బంది హెడ్‌క్వార్టర్‌లోనే ఉండాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పాత భవనాల్లో ఉన్న వారిని సహాయక శిబిరాలకు తరలించి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వర్షాల వలన పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం నుంచి సహాయం అందించేలా చూడాలని తహసీల్దార్లకు చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, చెరువులకు గండ్లు పడితే మరమ్మతు చేపట్టేందుకు అవసరమైనవి సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పెట్టని వాటిని మార్కింగ్ చేసి గ్రౌండింగ్ చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి ఓటర్ మ్యాపింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, జెడ్పీసీఈఓ వెంకటరెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, డీపీఓ పార్థసారథి, గృహ నిర్మాణ శాఖ పీడీ భాస్కర్, ఏపీడీలు ముసాయిదాబేగం, శారద తదితరులు పాల్గొన్నారు.