
ఆశల సాగు
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా అంతటా వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. ఇప్పటికే కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండి జలకళ సంతరించుకుంది. చాలాచోట్ల భూగర్భ జలమట్టం పెరిగింది. మరోవైపు ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. వర్షం కారణంగా విద్యార్థులు పాఠశాలలకు, ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా జిల్లాలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజులపాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పంటలను ఆశిస్తున్న తెగుళ్లు
వరితోపాటు ఆరుతడి పంటలకు తెగుళ్లు వెంటాడుతున్నాయి. వ్యవసాయానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. కొన్నిరోజులుగా ఎండలు లేకపోవడంతో అధిక వర్షాలు పంటలను దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం పంట పొలాల్లో నీరు నిలుస్తుండటంతో తెగుళ్ల బారిన పడుతున్నాయి. ప్రస్తుతం పంట పొలాలపై పచ్చ పురుగు దాడి చేస్తుంది. దీంతో తెగుళ్ల నివారణకు రైతులు పురుగు మందు పిచికారీ చేస్తున్నారు. అయితే వర్షాలు తగ్గిన తర్వాతే మందులు పిచికారీ చేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
పత్తికి ఊపిరి..
వర్షాకాలం ప్రారంభంలోనే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భావించి పత్తి రైతులు ముందస్తుగా విత్తనాలు వేసుకున్నారు. ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో మొక్కలు వాడిపోయే దశకు చేరుకున్నాయి. రైతులు పత్తి పంటపై ఆశలు వదులుకుంటున్న తరుణంలో అల్పపీడనంతో వర్షాలు విస్తారంగా పడుతుండటంతో తెల్ల బంగారంగా భావించే పత్తి పంటకు ఊపిరిస్తున్నాయి. జిల్లాలో 85,000 ఎకరాల్లో పత్తి సాగు అంచనాలకు గాను ఇప్పటి వరకు 80,523 ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం రైతులు కలుపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
జోరుగా నాట్లు
జిల్లాలో వానాకాలం సీజన్ ప్రారంభంలో వర్షాలు లేక వరినాట్లు మందకొడిగా సాగాయి. రైతులు కూడా నారుమడులు సిద్ధం చేసుకున్న నాట్లు వేసుకోలేక ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు వరి సాగుపై ఆశలు పెంచాయి. జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా ఉండగా, ఇప్పటి వరకు 1,00,127 ఎకరాల్లో సాగు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో పంటలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.
జిల్లాలో విస్తారంగా వర్షాలు.. జోరుగా వరి నాట్లు
ఇప్పటికే సగటుకు మించి
వర్షపాతం నమోదు
మత్తడి దూకుతున్న చెరువులు.. కోయిల్‌సాగర్‌కు జలకళ
ఆరుతడి పంటలకు
పొంచి ఉన్న తెగుళ్ల బెడద
మరో రెండురోజులపాటు వర్ష సూచన
నమ్మకం పెరిగింది..
వానాకాలం సీజన్ ఆరంభంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో వరి పంట సాగు చేశాను. ఆ తర్వాత వరుణుడు ము ఖం చాటేయడంతో పంటపై పెట్టుకున్న ఆశలు వదులుకున్నా. ఇప్పుడు మళ్లీ విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వరి పంట చేతికొస్తుందనే నమ్మకం పెరిగింది.
– వెంకటేశ్వర్‌రెడ్డి, రైతు, మాచన్‌పల్లి గ్రామం, మహబూబ్‌నగర్ రూరల్
భూగర్భజలాలు వృద్ధి..
ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు మెట్ట పంటలకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పత్తి చేలు వాడు దశలో ఉన్న సమయంలో వర్షాలు కురవడంతో ఆ పంటకు ప్రాణం పోసినట్లయింది. అయితే పంటలను ఆశిస్తున్న పచ్చ పురుగు నివారణకు కోరాజెన్ 60 మి.మీ., మందును ఎకరాకు పిచికారీ చేయాలి. అలాగే పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
– వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

ఆశల సాగు

ఆశల సాగు

ఆశల సాగు