
‘పల్లెగడ్డ’ గ్రామస్తులకు అండగా ఉంటాం
మరికల్: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని చిన్నరాజమూరు ఆంజనేయస్వామి దేవాలయ భూమిలో నివాసముంటున్న నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ్డ గ్రామస్తులకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సూర్యమోహన్‌రెడ్డి అన్నారు. ‘సాక్షి’లో ఈ నెల 17, 18 తేదీల్లో వరుసగా ప్రచురితమైన ‘మేమెక్కడికి పోవాలె.. ఈ పల్లె.. మా గడ్డ’ ‘పల్లెగడ్డను వదులుకోం’ కథనాలకు స్పందించిన నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి.. పల్లెగడ్డ గ్రామాన్ని సందర్శించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం పల్లెగడ్డ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి శైలజ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సూర్యమోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2018 నుంచి గ్రామాన్ని ఖాళీ చేయాలని 36 మందికి దేవాదాయశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారని.. ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామని, రూ.లక్షలు వెచ్చించి నివాస గృహాలు నిర్మించుకున్నామని, ఇప్పుడు పొమంటే ఎక్కడికి వెళ్లాలని ఆయనతో గ్రామస్తులు గోడు వెల్లబోసుకున్నారు. ఆయన స్పందిస్తూ.. ఈ విషయంపై ఎమ్మెల్యే దేవాదాయశాఖ కమిషనర్‌తో మాట్లాడారని, ఇకపై గ్రామంలో ఎవరికి నోటీసులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే నోటీసులు వచ్చి కోర్టుకు తిరుగుతున్న వారి తరపున ప్రభుత్వం నుంచి న్యాయవాదిని నియమించి కోర్టులో వాదన వినిపిస్తామని.. పల్లెగడ్డ గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆయన వెంట నాయకులు రాయుడు, కుర్మయ్య, రాములు, నర్సప్ప తదితరులున్నారు.

‘పల్లెగడ్డ’ గ్రామస్తులకు అండగా ఉంటాం