
తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు
పాలమూరు: మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఆధైర్యపడకుండా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలోని ఫస్ట్ నవరత్నాలు శిక్షణ కేంద్రంలో మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు ఎప్పుడూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని, ఆలోచించి న్యాయపరంగా పోరాటం చేయాలన్నారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టాలపై మహిళలకు అవగాహన కలిగించారు.
రేపు జాబ్‌మేళా
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రైవేట్ రంగ సంస్థల్లో నిరుద్యోగ యువతకు జాబ్‌లు కల్పించేందుకు గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ బాలుర కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రి ప్రియ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 340 ఉద్యోగాల కోసం నిర్వహించే జాబ్‌మేళాకు అభ్యర్థులు పూర్తి సర్టిఫికెట్లతోపాటు ఆధార్ కార్డు, బయోడేటాతో హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 99485 68830, 89193 80410లను సంప్రదించాలని సూచించారు.
ఉద్యోగ, పెన్షనర్లసమస్యలు పరిష్కరించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, కార్యదర్శి చంద్రనాయక్ మంగళవారం ఒక ప్రకనటలో డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలపై వచ్చే నెల 8న వరంగల్ నుంచి బస్సుయాత్ర చేపడుతున్నట్లు వివరించారు. ఈ యాత్ర 16న జిల్లాకు చేరుకుంటుందని, ఈ బస్సు యాత్రకు టీఎన్‌జీఓ సంపూర్ణ మద్దతు పలుకుతుందని చెప్పారు. బస్సు యాత్రను ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
చిన్నారుల్లోని నైపుణ్యాలు వెలికితీయాలి
దేవరకద్ర: ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వీటి ద్వారా వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయాలని డీఈఓ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాల చిన్నారులకు ఉపకరణాల గుర్తింపు, నిర్ధారణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక అవసరాల చిన్నారులకు కావాల్సిన వినికిడి యంత్రాలు, వీల్‌చైర్లు, ప్రైస్ రెంలేటర్సు, సీపీ చర్చ్, బ్రైలీ కిడ్స్, క్రష్ క్యాలిపర్స్, కృత్రిమ అవయవాలు అవసరమైన వారిని గుర్తించి త్వరలో అందించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలను తల్లిదండ్రులు భారంగా భావించరాదని, సాధారణ పిల్లల మాదిరిగానే వీరు కూడా చదువుకునేలా ప్రోత్సహించాలని కోరారు. భవిత సెంటర్లలో చదువుతోపాటు వారికి ఫిజియో, స్పీచ్ థెరపీ సేవలు, అవసరమైన ఉపకరణాలు అందిస్తామని చెప్పారు. అనంతరం డోకూర్ సమీపంలోని కేజీబీవీని డీఈఓ సందర్శించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ బాలుయాదవ్, ఎంఈఓలు బలరాం, మంజులత, జిల్లా అధికారులు సుధాకర్‌రెడ్డి, స్పెషల్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు