
గ్రామంలో దుందువా తయారు చేస్తున్న హరిజనులు
జడ్చర్ల టౌన్: అమాస మల్ల దుందువా అంటూ పాటలు పాడుతూ మండలంలోని గంగాపురంలో మంగళవారం రాత్రి దుందువా వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా లక్ష్మీచెన్నకేశవస్వామి కొలువైన గంగాపురంలో 125 అడుగుల దుందువాతో గ్రామంలో వేడుకలు అట్టహాసంగా, ఉల్లాసభరిత వాతావరణంలో కొనసాగించారు. దీపావళి అమావాస్య మరుసటి రోజున ఈ వేడుక నిర్వహించటం అనాదిగా వస్తుంది. ఇందుకోసం గ్రామ హరిజనులు తెల్లవారుజామున స్నానాదులు ఆచరించి పొలాల్లోంచి వావిలి, కంది, జీనుగ, గోగునార కట్టెలు తీసుకొచ్చి మూడు అడుగుల వెడల్పు, 125 అడుగుల పొడవుతో వరితాళ్లతో దుందువాను తయారు చేస్తారు. దాదాపు 50 మంది దుందువా తయారీ చేసేవారు పూర్తయ్యే వరకు నిష్టతో ఉండటం గమనార్హం. వరి తాళ్లను పేని వావిలి, గోగునార, జీనుగ కర్రలను పేర్చి పెద్ద దుందువాను తీర్చిదిద్దారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేవలం పదిగంటల్లోనే దీన్ని తయారు చేయటం విశేషం. తయారైన దుందువా వద్ద హరిజనులు పూజలు చేసిన అనంతరం గ్రామస్తులు దాని చుట్టూ తిరుగుతూ మొక్కారు. అనంతరం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో దుందువాను లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం ఎదురుగా తీసుకెళ్లి ఆలయ పూజారులు మేళతాళాలతో వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం జై చెన్నకేశవ నామస్మరణల మధ్య దుందువాకు ఒకవైపు నిప్పంటించారు. అనంతరం గ్రామస్తులు బారీ తాళ్లతో దానిని గ్రామ వీధుల్లోకి లాగుతూ దివ్వి దివ్వి దీపావళి అంటూ దాని వెంట పరుగులు తీశారు. పిల్లలు, యువకులు, మహిళలు ఉత్సాహంగా గోవిందనామస్మరణతో వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామ వీధుల్లో దుందువా లాగుతుండగా.. దాని నుంచి విడిపోయే కర్రలు లాక్కునేందుకు పోటీ పడ్డారు. దుందువాలోని కర్రలను తీసుకెళ్లి ఇంట్లో ఉంచుకోవటంతో మంచి జరుగుతుందని గ్రామస్తుల విశ్వాసం. దుందువా వేడుకలతో గ్రామంలో శీతాకాలంతో వచ్చే వ్యాధులు ప్రబలకుండా ఉంటుందని గ్రామస్తుల నమ్మకం.
125 అడుగుల వావిలి, జీనుగ,
గోగునార, కంది కట్టెలతో తయారీ
రాష్ట్రంలోనే అతిపెద్ద దుందువా వేడుక