ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. భర్తను నరికి చంపిన భార్య | - | Sakshi
Sakshi News home page

ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. భర్తను నరికి చంపిన భార్య

May 1 2023 1:18 AM | Updated on May 1 2023 1:18 PM

- - Sakshi

మహబూబ్‌నగర్: ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. కులాలు వేరైనా కలిసి జీవించాలనుకున్నారు. ఈ క్రమంలో పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం సైతం కలిగారు. అలా సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలో మద్యం చిచ్చురేపింది. తాగుడుకు బానిసైన భార్యాభర్తలు ఇద్దరూ మద్యం మత్తులో తరుచుగా గొడవపడేవారు. దీంతో విసిగివేసారిన భార్య క్షణికావేశానికి లోనై.. పిల్లలు వద్దని వారిస్తున్నా.. నిద్రిస్తున్న భర్తను గొడ్డలితో నరికి చంపేసింది. ఈ విషాదకర సంఘటన ఇటిక్యాల మండలంలోని మొగిలిరావులచెర్వులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి ఇటిక్యాల ఏఎస్‌ఐ అయ్యన్న, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవరాజు అలియాస్‌ దేవదాసు(35) వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చెల్లెపాడుకు చెందిన అలివేలును 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరు మద్యం మత్తులో తరుచుగా గొడవపడేవారు. ఈ క్రమంలో శనివారం రాత్రి దేవదాసు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. దీంతో అర్ధరాత్రి పడుకున్న భర్తను పిల్లలు చూస్తుండగానే గొడ్డలితో విచక్షణారహితంగా నరకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. దేవదాసుకు భార్య అలివేలుతోపాటు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై దేవదాసు సోదరుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. సంఘటనా స్థలాన్ని అలంపూర్‌ సీఐ సూర్యనాయక్‌ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement