గోపాల్‌పేట: ఆటోడ్రైవర్ కోనేరులో మునిగి మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జలీల్ మియాకు ఐదుగురు కుమారులు, కూతురు ఉండగా.. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. చిన్నకుమారుడు ఎండీ నజీర్(43)కు పదేళ్ల క్రితం పెళ్లయి ఒక కూతురు ఉన్నారు. ఐదేళ్ల కిందట నజీర్ భార్య తనను విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఒక్కడే ఇంటి వద్ద ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల నుంచి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం 8గంటల ప్రాంతంలో గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయం వద్ద కోనేరులో దిగి ఈత కొట్టాడు. ఒకసారి పైకివచ్చి మళ్లీ వెళ్లి కోనేరులో దూకి పైకి రాలేదు. దీంతో కోనేరులో మునిగిపోయాడని పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది కోనేరులో వెతికి మధ్యాహ్నం నజీర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి మేనల్లుడు మహమూద్ తన మామ చావుపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు చెప్పినట్లు తెలిపారు.


