● మాజీ సర్పంచ్ ఇంటి ఎదుట
నాలుగు రోజులుగా మహిళ నిరసన
ఖిల్లాఘనపురం: బయానా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని ఓ మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలం మానాజీపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కాళ్ల మల్లయ్య 2025 ఆగస్టు 11న మాజీ సర్పంచ్ సతీశ్‌కుమార్‌తో సర్వే నంబర్ 271, 274లోని 4.09 ఎకరాల వ్యవసాయ భూమిని ఎకరానికి రూ.17 లక్షల చొప్పున కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో బయానాగా రూ.6.5 లక్షలు ఇచ్చాడు. భూమి డబ్బులు చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య తగాదా రావడంతో కొనుగోలు లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో బయానా డబ్బులు తిరిగి ఇవ్వాలని జూన్ 13న బాధితులు కాళ్ల మల్లయ్య మాజీ సర్పంచ్ సతీష్ ఇంటి ఎదుట తన భార్య లక్ష్మమ్మ, దివ్యాంగులైన కుమారుడు సాయిలు, కోడలు రాజేశ్వరి, చంటిపాప తంబికతో కలిసి నిరసన చేపట్టారు. ఎస్‌ఐ వెంకటేష్, సర్పంచ్ శ్రీలతరఘు, గ్రామ పెద్దలు నచ్చజెప్పడంతో నిరసన విరమించారు. బయానా బదులుగా ఎకరం పొలం కొనుగోలు చేయాలని, బయానా పోనూ మిగిలిన డబ్బులు జూన్ 29 వరకు మాజీ సర్పంచ్ సతీశ్‌కు ఇవ్వాలని పెద్దలు తీర్మానించారు. డబ్బులు చెల్లించకపోవడంతో పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదని మల్లయ్య భార్య లక్ష్మమ్మ నాలగు రోజులుగా మాజీ సర్పంచ్ ఇంటి ఎదుట నిరసన చేపట్టింది. డబ్బులు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని శుక్రవారం పురుగుమందు తాగింది. స్పందించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రికి తరలించారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
కోస్గి: మద్దూరు మండలంలోని జాదరావ్‌పల్లికి చెందిన శాంతమ్మ (43) అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మద్దూరు ఎస్‌ఐ శ్రీనివాసులు కథనం ప్రకారం.. దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లిలో బంధువుల ఇంట్లో ఈనెల 11న ఫంక్షన్ ఉందని గ్రామం నుంచి బయలుదేరింది. ఆరోజు నుంచి కనిపించకపోవడంతో ఈనెల 15వ తేదీ మృతురాలి కుమారుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. గురువారం సాయంత్రం నారాయణపేట జిల్లా జాజాపూర్ శివారులో ఉన్న చెరువు వద్ద చెట్లపొదల్లో మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులను ఘటనా స్థలికి తీసుకెళ్లగా.. కుమారుడు మహేశ్ తల్లి గుర్తించాడు. నగల కోసమే తన తల్లిని హత్య చేసినట్లు కుమారుడు అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సైబర్ మోసం.. డబ్బులు లూటీ
మిడ్జిల్: మండల కేంద్రానికి చెందిన యువకుడు లాలు ముదిరాజ్ సెల్‌ఫోన్‌ను శుక్రవారం సైబర్ కేటుగాళ్లు య్యాక్ చేసి నగదును దోచేశారు. ముందుగా అతని సెల్ నంబర్‌కు ఆర్‌టిఓ చలాన్ పడినట్లు ఏపీకే లింకు పంపించారు. అది ఓపెన్ చేసిన లాలు అకౌంట్ నుంచి రూ.9 వేలు అలాగే అయ్యప్పరెడ్డి ఫోన్ నుంచి రూ.16వేలు మరికొంత మంది నగదు కాజేశారు. కొంతమంది బ్యాంకుకు వెళ్లి ఖాతాలను సకాలంలో లాక్ చేయడంతో పెద్ద మొత్తంలో డబ్బులు పోకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయంపై ఎస్‌ఐ శ్రీనివాస్‌ను వివరణ కోరగా స్టేషన్‌లో ఎవరు ఫిర్యాదు చేయలేదని తెలిపారు.


